శ్రీవాణీ వీణాజనితం

నాకు బాగా నచ్చిన సంగీత దర్శకులలో ఎం.ఎస్.విశ్వనాథన్ ఒకరు. కే.బాలచందర్ ఎం.ఎస్.విశ్వనాథన్ కాంబినేషన్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అంతులేని కథ ,ఇది కథ కాదు ,గుప్పెడు మనసు, మరోచరిత్ర, ఆకలిరాజ్యం, కోకిలమ్మ మచ్చుకు కొన్ని. వీటిలో కోకిలమ్మ సినిమాలోని ఒక మంచి పాట గురుంచే ఈ టపా (మొదట పాట వినాలనుకున్న వాళ్ళు చివరి వాక్యానికి వెళ్తే లింకు దొరుకుతుంది).



1983లో విడుదలైన కోకిలమ్మ లో సరిత ప్రధాన పాత్ర పోషించారు.  ఈ సినిమా సమాచారం కోసం, వీడియో కోసం చాలా వెదికాను కానీ ఎక్కడా దొరకలేదు. చూడాలనుకున్నా అవకాశం రాక చూడలేకపోయిన సినిమాల్లో ఇదొకటి.  అంతర్జాలంలో యూట్యూబ్ లింకులు కొన్ని దొరికాయి కానీ ఆవీ పాటలకు సంబంధించినవే.  టైటిల్‌ని బట్టి కథానాయిక ప్రఖ్యాత గాయకురాలై ఉంటుందని ఊహించాను. యూట్యూబ్‌లో నాలుగు పాటలు  చూశాక నా అంచనాలు తప్పని అర్థమయ్యింది. బాలచందర్ సినిమాల్లో పాటలు  కథతో పెనవేసుకొని అర్థవంతంగా ఉంటాయి కాబట్టి స్టోరీలైన్ సులభంగానే బోధపడింది. అలాగే బాలచందర్ అంటేనే సీరియస్ సినిమాలు కాబట్టి, వాటిలో సుఖాంతాలు తక్కువే కాబట్టి నేనూహించుకున్న స్టోరీలైన్‌కి ఒక ట్రాజెడీ ముగింపుని జోడిస్తే కథ చిక్కుముడి తేలిగ్గా విడిపోయింది. 


కోకిలమ్మ (సరిత) ఒక పనిపిల్ల. తనలాగే నిరుపేదైన కథానాయకుడికి (రాజీవ్) ఆసరాగా నిలబడి అతని అభ్యున్నతికి ఎంతో సహాయం చేస్తుంది. అతను పెద్ద గాయకుడై ఎదిగి తన మూలాలు మరచిపోతాడు. ఒక గొప్పింటి అందమైన అమ్మాయి (స్వప్న) ప్రేమలో పడి కోకిలమ్మకు దూరంగా మెలగుతాడు. విషయం తెలుసుకున్న  కోకిలమ్మ నిస్వార్థంగా తప్పుకొని త్యాగం చెయ్యటంతో కథ  సమాప్తమవుతుంది.




ఈ చిత్రానికి కోకిలమ్మ అని పేరు పెట్టటంలో దర్శకుడి నేర్పు కనిపిస్తుంది. కోకిల నల్లగా అందవిహీనంగా ఉంటుంది. పుట్టక ముందే తల్లి తెచ్చి తనను కాకుల గూడులో విడిచిపెడుతుంది. కాకుల మధ్య కాకిలా పొదగబడ్డ కోయిల, కాకిపిల్లలతో కలిసి  తొలుత కాకిలానే ప్రవర్తిస్తుంది, అరుస్తుంది. క్రమంగా కూయటం అనే తన ప్రత్యేకత అవగతమయ్యాక, తన స్వరూపాన్ని గ్రహించి వేరుపడి వెళ్ళిపోతుంది. కథానాయిక కోకిలమ్మ కూడా అంతే. తనకంటూ ప్రత్యేకమైన స్వచ్ఛమైన మనసున్నా,కమ్మని పాటలు పాడగల నేర్పున్నా, కాకుల్లాంటి లోకులకు పరిచర్యలు చేస్తూ అవకాశవాదైన మరో కాకి లాంటి వ్యక్తిని ప్రేమిస్తుంది. చివరికి అతని నిజస్వరూపం గ్రహించి తనే తప్పుకొని వెళ్ళిపోతుంది.

కోకిలమ్మ అనగానే చాలా మందికి 'పల్లవించవా నా గొంతులో' అనే ఫాట గుర్తొచ్చినా, మిగతా పాటలూ చాలా బావుంటాయి. శ్రీవాణీ వీణాజనితం అలాంటి ఒక ఆణిముత్యం. మనసుకవిగా చిరపరిచితులైన ఆచార్య ఆత్రేయ ఈ పాటకు గేయరచన చేశారు . పాడినవారు పి.బి.శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట సందర్భం తెలియదు కానీ వింటూంటే, సంగీతం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ సభలో కథానాయకుడు పాడిన పాటలా అనిపిస్తుంది.


పి.బి.శ్రీనివాస్ గాత్రంతో పాట మొదలవుతుంది.

మధురం మధురం నాదం
అది అమరం అమరం వేదం
నాదం గానం సామం
స్వరకలితం లలితం రమ్యం

నాదం అంటే సంస్కృతంలో శబ్దతరంగం, జగత్సంబంధమైన స్పందనం అనే అర్థాలున్నాయి. అలాగే క్రమబద్ధమైన మధురమైన శబ్దం అని కూడా అర్థముంది . అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లుతో, అపసవ్యమైన జీవన విధానాలతో , విపరీతమైన మానసిక  శారీరక ఒత్తిళ్ళతో అతలాకుతలమయ్యే హృదయాలను, సేదతీర్చి, సత్తువనిచ్చే శక్తి నాదానికి ఉంది. వేదానికి మరో పేరు శృతి. నేరుగా వినడం ద్వారా బహిర్గతమైనవి కనుక శృతులంటారు. ఆ వేదాలలో ఉన్నవి మంత్రోచ్ఛాటనలు, శ్లోకాలు, స్తోత్రాలు .జీవాత్మలో పరమాత్మలా ఆ మంత్రోచ్ఛటనలు, శ్లోకాలు, స్తోత్రాలలో దాగున్నది స్వరాలతో సమ్మిళితమైన లలితమైన రమ్యమైన నాదమే.  క్రమపద్ధతిలో వినిపించే నాదం మనస్సుని పట్టి ఉంచి, ఏకాగ్రతని పెంచి, బుద్ధిని వికసింపజేసి శరీరాన్ని అమరం చేస్తుంది. అందుకే నాదం అమరం. నాదాలతో నిండిన వేదం అమరం. 

 శ్రీవాణీ వీణాజనితం సురలోక మౌని సరితం
అతిలోక బ్రహ్మానందం ఓంకారనాదం
అమితం అమృతం నిరతం
శిశు పశు ఫణి సహితం విదితం
శౌకం  మధ్యమదూతం
త్రైకాల సంచారం

ఓంకార నాదం వైశిష్ట్యాన్ని తెలిపే పల్లవి ఇది. ఇందులో నాకు అర్థం కాని కొన్ని వాక్యాలున్నాయి. నాకు తెలిసినంతలో విశ్లేషించటానికి ప్రయత్నిస్తాను. అకార (సృష్టి- బ్రహ్మ) ఉకార (స్థితి- విష్ణు) మకారాల (లయ-మహేశ్వరుడు) కలయికే ఓంకారం. అది ఆద్యంతాలు లేని ప్రణవ నాదం. అంటే అంతమూ, ఆరంభమూ రెండూ లేవన్నమాట. అన్ని శబ్దాలకి మూలమిదే. అటువంటి ఈ నాదాన్నే స్వర్గలోకంలో ఉన్న మహర్షులు, బ్రహ్మర్షులు నిత్యం స్మరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తూంటారు. (నా దగ్గరున్న శబ్దరత్నాకరంలో ' సరితం' అనే పదం లేదు. ఆంధ్రభారతి పదకోశంలో సరితం అంటే చరితం అని ఉంది. అలాగే ' సరిత్ ' అంటే నది అనే అర్థముంది. ఈ అర్థాన్ని స్వీకరిస్తే సురలోక మహర్షులు స్నానమాడి పునీతమయ్యే నది లాంటి ప్రణవనాదం అనుకోవాల్సి వస్తుంది )

ఓంకారానికి ఆద్యంతాలు లేవనుకున్నప్పుడు శ్రీవాణీ వీణాజనితం (సరస్వతీదేవి వీణలోంచి జన్మించినది) అనడం తప్పేమో అనిపించింది. అంతర్జాలాన్ని శోధిస్తే సంగీత రత్నాకరం ప్రకారం వీణ(సంగీత వాయిద్యం) దేవతలకు ఆవాసమని, మెడలో మహేశ్వరుడు, తీగలలో పార్వతీ దేవి, వాటిని పట్టి ఉంచుతూ లక్ష్మీదేవి, యాళిలో (పౌరాణిక జంతువు మెడ ఆకారం) విష్ణువు, రెండవ సొరకాయబుర్రలో బ్రహ్మ, ప్రతిధ్వనించే నాదంలో సరస్వతీదేవి కొలువై ఉంటారని  తెలిసింది. సరస్వతీదేవి చేతిలో ఉంటుంది కాబట్టి సరస్వతివీణ అని కూడా అంటారు. సరస్వతికి మరోపేరు శ్రీవాణి. ముగ్గురమ్మలు, త్రిమూర్తులు కలిసి కొలువై ఉన్న చోట ప్రణవనాదమైన ఓంకారమేగా వినిపిస్తుంది. కాబట్టి శ్రీవాణీ వీణాజనితం అన్నమాటకు లెక్కసరిపోయింది. పశువులకు,శిశువులకు, పాములకు సైతం తెలిసిన సంగీతం, పక్షుల కూతల్లో   మధ్యమస్వరంలో రాయాబారాలు నడుపుతూ(శౌకం అంటే శుక సమూహం,శుకం అంటే చిలుక, మధ్యమం సరిగమపదనిలో ఒక స్వరం, దూతం అంటే  రాయబారి)   అమితమైన అమృతంలా త్రికాలాల్లో(భూత,భవిష్యత్,వర్తమాన)   నిరంతరం ఉంటుందని ఆత్రేయ గారి భావమనుకుంటాను.

మామూలు వెదురే మాధవ మురళియై రాగాల సుధలే చిలికినది
త్యాగయ్య గళమై అన్నయ్య పదమై వాగ్గేయ సిరులే కురిసినవి
గీతం కవితా హృదయం
సంగీతం జనతా హృదయం
రాగం తానం మకుటం
త్రైమూర్తి రూపం

మొదటి చరణంలోని పై వాక్యాలకు పెద్దగా వివరణ అక్కర్లేదనుకుంటాను. మొదటి వాక్యం నాకు బాగా నచ్చింది. సాధారణమైన వెదురుబొంగు శ్రీకృష్ణుని చేతిలో పడి సుమధురగీతాల సుధల్ని కురిపించిందంటే అది భగవంతుని అనుగ్రహ విశేషమే కదా. ఇదే అర్థమిచ్చేలా  వేటురి గారు ఏదో ఒక పాటలో చిన్న వాక్యం వ్రాసినట్లు గుర్తు. సమయానికి గుర్తురావటం లేదు. అన్నయ్య అంటే అన్నమయ్య . మాములుగా రాగం, తానం, పల్లవి అంటూంటాం. ఇక్కడ పల్లవి బదులు మకుటం అనే పదం వాడారు . మకుటం అంటే కిరీటం. పాటకు మకుటం పల్లవే కదా. ఈ మూడింటినీ త్రిమూర్తులతో పోల్చారు ఆత్రేయ.

జయదేవ కవితై, గోవింద గీతై పద్మావతేగా పలికినది
ప్రియురాలి శోకమే తొలికావ్య శ్లోకమై శ్రీరామ చరితై నిలచినది
తీరని దాహం గానం
కడతేర్చే జ్ఞానం గానం
రాగం మోదం మోక్షం సంగీత యోగం

జయదేవుడు 12వ శతాబ్దానికి చెందికి ఒక ప్రముఖ కవి. ఆయన భార్య పద్మావతి. ఇద్దరూ అన్యోన్య దంపతులు, పూరీ జగన్నాథస్వామి సేవకులు. జయదేవ కృతులలో గీతాగోవిందం అనే కావ్యం చాలా ప్రసిద్ది కెక్కింది. రాధాకృష్ణుల శృంగారాన్ని వర్ణిస్తూ వ్రాసిన వాటిని అష్టపదులంటారు. ఈ అష్టపదులలో పద్మావతి పేరు అనేక మార్లు దొర్లుతుంది. పద్మావతీ చరణ చారణ చక్రవర్తీ, పద్మావతీ రమణ..ఇలా. అది తన భార్యపై జయదేవునికున్న మమకారానికి గుర్తు. జయదేవుడు వ్రాసి స్వరపరిచిన ప్రతి అష్టపదిని పద్మావతి తన అపూర్వమైన నృత్య ప్రతిభతో స్వామి సన్నిధిలో అభినయించి చూపేది.

క్రౌంచ పక్షుల జంటను వేటాడి, వాల్మీకి కోపానికి గురై తద్వారా తొలిశ్లోక రచనకు కారణభూతుడౌతాడు ఒక బోయవాడు. ఆ శ్లోకమే శ్రీమద్రామాయణ మహాకావ్య రచనకు శ్రీకారం చుడుతుంది.  గానం ఒక తీరని దాహమే కాదు, జ్ఞానం ప్రసాదించి సంతోషాన్ని,విముక్తిని కలిగించేది కూడా అంటూ ఈ చరణం ముగుస్తుంది. వాల్మీకి నుంచి జయదేవుని వరకు, త్యాగయ్య నుంచి అన్నమయ్య వరకూ నాదోపాసకులంతా అలా సంగీత సుధాంబుధిలో తేలియాడి స్వరపరమాత్మలో లీనమై శాశ్వతులైన వాళ్ళే .మనసుకవి ఆత్రేయలో మరో పార్శ్వాన్ని ఆవిష్కరించిన  ఈ పాటను ఇక్కడ వినండి.





2 comments

శ్రీకాంత్ గారు,
కథ బాగానే ఊహించారు గానీ, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్రంలో సరిత మూగ, చెవిటి. పాటలు పాడగల నేర్పు ఉంటుందని అనుకున్నారు మీరు. తను పని చేస్తున్న ఇండ్లల్లో ఎందరో తనని తిడుతున్నా ఏమీ వినపడనట్లు వెళ్ళిపోవటం సరిత బాగా చేసింది.
అంతేకాదు , నాయకుడు పెద్ద గాయకుడై సభలో వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నట్లు చెప్పటం, అందుకు అందరూ చప్పట్లు కొడితే విషయమే తెలీక (అతన్ని మెచ్చుకుంటున్నారేమో అనుకుని) తనూ చప్పట్లు కొట్టటం కన్నీళ్ళు తెప్పిస్తుంది.
మీరన్నట్లు పల్లవించవా గుర్తొస్తుంది కానీ ఈపాట గుర్తులేదు.
ధన్యవాదాలు.

Reply

లక్ష్మీదేవి గారు,సినిమా కథ గురుంచి విపులంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.కథనాయికకు కేవలం చెవుడు మాత్రమే ఉందేమోనండి.మూగ అయితే 'కొమ్మ మీద కోయిలమ్మ కుహూ అన్నది అని పాట పాడదు' కదా? ఒక చెవిటిదాన్ని నాయికగా పెట్టి సినిమా తీసే ధైర్యం ఈ రోజుల్లో ఏ క్రియేటివ్ డైరెక్టర్లకీ లేదు.బాలచందర్ గారు ఆ రోజుల్లోనే తీసి చూపించారంటే నిజంగా he is great.

Reply
Post a Comment