పృథ్వీరాజ్ చౌహాన్‌ది ధృతరాష్ట్రుని అంశా?


రాక్రమవంతుడైన పృథ్వీరాజ్ చౌహాన్ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఢిల్లీ -అజ్మీర్‌లను రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేసిన ఆఖరి హైందవరాజు, రాజపుత్ర యోధుడు అతను. అతని భార్య సంయుక్త. వారిద్దరి ప్రేమ, పరిణయం చాంద్‌బార్దాయ్ వ్రాసిన 'పృథ్వీరాజ రాసో ' సాక్షిగా జగద్వితం. మహమ్మదీయుల దండయాత్రను సమర్థవంతంగా తిప్పిగొట్టి తుదకు మళ్ళీ అదే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పృథ్వీరాజ్ ధీరోద్ధాత్తత గురుంచి రకరకాల గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భవిష్యపురాణంలోనూ ఈ చారిత్రక పురుషుడి ప్రస్తావన ఉంది.


భవిష్యపురాణం ప్రకారం ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్న అనంగపాలుడనే రాజుకు చంద్రకాంతి, కీర్తిమాలిని అని ఇద్దరు కూతుళ్ళు. చంద్రకాంతిని కన్యాకుబ్జాన్ని ఏలుతున్న రాష్ట్రపాలుని వంశీయునికిచ్చి పెళ్ళి చేస్తే, కీర్తిమాలినిని చవహని వంశస్థుడైన సొమేశ్వరునికిచ్చి వివాహం జరిపిస్తాడు.చంద్రకాంతికి జయచంద్రుడు, రత్నభానుడనే పిల్లలు కలుగుతారు. కీర్తిమాలినికి ముగ్గురు పిల్లలు పుడతారు -ధుందుకారుడు,కృష్ణకుమారుడు, పృథ్వీరాజు. వీళ్ళలో పృథ్వీరాజుది ధృతరాష్ట్రుని అంశ. అమిత బలపరాక్రమాలు కలవాడు. పన్నెండేళ్ళ ప్రాయంలోనే సింహంపై స్వారీ చేస్తాడు. మనవడి శౌర్య సంపత్తికి మెచ్చిన తాత అనంగపాలుడు అతన్ని దత్తత్త తీసుకొని రాజ్యాన్ని కట్టబెట్టి హిమాలయాలకు వెళ్ళిపోతాడు.సోదరులిద్దరూ తనకు శతృవులని భావించిన పృథ్వీరాజు, తాత పరమపదించగానే వాళ్ళను రాజ్యం నుండి వెళ్ళగొడతాడు.వాళ్ళు తమ తమ మంత్రులని వెంటబెట్టుకొని కన్యాకుబ్జాన్ని పాలిస్తున్న జయచంద్రున్ని శరణు వేడుతారు.అతడు ఆభయమిచ్చి ఆశ్రయం కల్పిస్తాడు. జయచంద్రునికి అగమ, మలన అని ఇద్దరు చెల్లెళ్ళు. అగమను పృథ్వీరాజుకిస్తారు. మలనను ధుంధుకారుని మంత్రైన ప్రద్యోతనునికిచ్చి పెళ్ళి జరిపిస్తాడు. పృథ్వీరాజు కొత్త దుర్గాన్ని నిర్మించి దాని గుమ్మాన్ని ఎత్తిస్తాడు. ఆ గుమ్మం భాగ్యప్రదాత అని భావించి దానికి దేహలి అని నామకరణం చేస్తాడు (అదే నేటి ఢిల్లీ). కొంతకాలానికి ' తాత ఆస్తిలో తనకూ భాగముందని, తన భాగం తనకు వదిలిపెట్ట ' మని వర్తమానం పంపుతాడు జయచంద్రుడు. పృథ్వీరాజు తిరస్కరిస్తాడు. వైరం మొదలవుతుంది.

జయచంద్రుని తమ్ముడైన రత్నభానుడు (ఇతని కొడుకే నకులాంశ సంభూతుడు లక్షణుడు) పృథ్విరాజు పాలనలో ఉన్న కొంత ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటాడు. జయచంద్రునికి పిల్లలు కలుగరు. దాసీదాని మీద మనసు పడి ఆమె ద్వారా సంయుక్త అనే పుత్రికకు తండ్రవుతాడు. ఆమె యుక్తవయస్సుకు రాగానే స్వయంవరం ప్రకటిస్తాడు. పృథ్వీరాజు ధైర్యసాహసాలు విన్న ఆమె స్వయంవర మంటపంలో అతని బంగారు ప్రతిమను పుష్పమాలాంకృతం చేస్తుంది. ధైర్యముంటే వచ్చి తీసుకెళ్ళమని పృథ్వీరాజుకు సవాలు విసురుతాడు జయచంద్రుడు. పృథ్విరాజు ససైన్యంతో వచ్చి సంయుక్తను తీసుకెళ్తాడు. హోరాహోరీగా జరిగిన యుద్ధంలో రత్నభానుడు నిహతుడవుతాడు.


పృథ్వీరాజు లక్ష చండీయాగం చేస్తే దేవి ప్రసన్నురాలై కౌరవుల అంశతో కుమారులను, ద్రౌపది అంశతో కూతురును అనుగ్రహిస్తుంది. అయితే వీరు సంయుక్త ద్వారా కలిగిన సంతానమో మరెవరి ద్వారా కలిగిన సంతానమో తెలియదు.కూతురు పుట్టగానే భూమి కంపించి, రక్తమాంస వర్షం కురిసి, ఆకాశం నుంచి చండిక వికటాట్టహాసం చేస్తుంది.ఆమె పేరు ఏల. పన్నెండేళ్ళ ప్రాయంలో ఆమె తండ్రిని పిలిచి మండపంలో రక్తధారలతో తనకు అభిషేకం చేయించేవాడు, ద్రౌపది నామధేయంతో నగలను సమర్పించేవాడు తనకు నాథుడవుతాడని చెబుతుంది. పృథ్వీరాజు ఆ విధంగా శాసనం వ్రాయించి, కర్ణాంశ సంజాతుడైన తన కొడుకు తారకునిచ్చి, ఒక లక్ష సైన్యంతో దేశం మీదకు పంపుతాడు. రాజులందరూ వెనుకంజ వేస్తే అర్జునాంశ సంజాతుడైన బ్రహ్మానందుడు అందుకు సంసిద్ధుడౌతాడు.(ఇతను మలన కుమారుడు.ఇతని స్నేహితుడు కృష్ణుని అంశలో పుట్టిన జయసింహుడు). వివాహానికి ఎక్కడెక్కడి రాజులూ సైన్యంతో వస్తే పృథ్వీరాజు ఆశ్చర్యపోయి వారికి శిబిరాలు ఏర్పాటు చేస్తాడు. వివాహమైన వెంటనే తారకాదులు చెలరేగి యుద్ధం చేస్తే జయసింహుడు ఖడ్గధారియై దూకి తన వారిని ఆదుకుంటాడు.సకలవిద్యాపారంగతుడైన పృథ్వీరాజు రెండవ కురుక్షేత్ర యుద్ధంలో (రెండవ తైరైను యుద్ధంలో) మహమ్మదు ఘోరీ చేతిలో అపజయం పాలై మరణిస్తాడని,అంతటితో అతని వంశం క్రమంగా అంతరిస్తుందని, నకులాంశ సంభూతుడైన లక్షణుడు కూడా ఈ యుద్ధంలో మరణిస్తాడని భవిష్య పురాణం తెలియజేస్తోంది.

పురాణాల్లో ఇలా ఉంటే చరిత్రకారుల భాష్యం మరోలా ఉంది. అనంగపాలుడనే తాత పృథ్వీరాజుకున్నా, ఆ తాతయ్య కూతుళ్ళ పేర్లు మాత్రం రూపసుందరి, కమలాదేవి. సోమేశ్వరరాజు (తండ్రి పేరు సరిపోయింది) -కమలాదేవిల తనయుడు పృథ్వీరాజ్ చౌహాన్. పృథ అనే చెల్లేలు మాత్రం ఉంది.చిత్తోడ్ రాజైన సమర్‌సింగ్ ఈమె భర్త . రెండవ తైరైను యుద్ధంలో అన్నయ్య ఓడిపోవటం, భర్త, కన్నకొడుకూ వీరమరణం పొందటంతో అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. పృథ్వీరాజుకు హరిరాజనే సోదరుడున్నట్లు కొంత సమాచారముంది. పృథ్వీరాజు మరణాంతరం, అతని కుమారుడైన గోవిందరాజుని అజ్మీర్ సామంత రాజుగా ప్రకటిస్తారు ముసల్మానులు. హరిరాజు అతన్ని పడగొట్టి రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. తురుష్కులపై తిరుగుబాటు చేసి కొంతమేర సఫలీకృతుడై చివరికి పరాజితుడై ఆత్మార్పణ చేసుకుంటాడు. పృథ్వీరాజుకు చాలామంది సంతానమున్నట్లు, వీరిలో కొందరు ఇస్లాం మతం పుచ్చుకున్నట్లు కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు గానీ ఎక్కడా ఏల తారకుడిల ప్రస్తావన లేదు. అలాగే జయచంద్రుడు - పృథ్వీరాజ్ అన్నదమ్ములన్న విషయం రూఢియైనా , జయచంద్రుని తమ్ముడైన రత్నభానుడి విషయంలో సమాచారం లేదు. సంయుక్త జననంలోనూ స్పష్టత లేదు.

భవిష్యపురాణంలో వివాస్పద అంశాలు చాలా ఉన్నాయి. ఏది వ్యాసకృతమో, ఏది ఇతరుల కల్పనో తెలియదు. వాటిలో పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర ఒకటి. ధృతరాష్ట్రాంశతో జన్మించిన పృథ్వీరాజు వరుసకు అన్నకూతురైన సంయుక్తను లేవదీసుకొని వివాహమాడటం ఏమిటో అంతుపట్టకుండా ఉంది. జయసింహుని లీలలు, చరిత్ర దాదాపుగా శ్రీకృష్ణుని చరిత్రను పోలివున్నాయి. ఇంతటి ప్రఖ్యాతి వహించిన రాజు నిజంగా పృథ్వీరాజు కాలంలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు.నకులాంశతోనూ, కర్ణాంశతోను ద్రౌపద్యాంశతోనూ పుట్టిన వాళ్ళు, ఇతర దివ్యాంశ సంభూతులు అనామకులుగా మరణించటమేమిటో అర్థం కాకుండా ఉంది. ఏ ప్రయోజనమూ నెరవేరనప్పుడు మహాత్ములు మళ్ళీ పుట్టడం దేనికి? ఇన్ని సందేహాల మధ్య అసలు భవిష్యపురాణంలో పేర్కొన్న పృథ్వీరాజు, మాములు జనానికి తెలిసిన పృథ్వీరాజు ఒక్కరేనా అన్న అనుమానం కలుగక మానదు.4 comments

February 17, 2013 at 4:09 PM

అయ్య బాబోయ్,

మీరు మరీ తీక్షణ మైన investigative mythological-historical బ్లాగర్ లాగున్నారండోయ్ !

చాలా రీసెర్చ్ చేసినట్టు ఉన్నారు !

మహాభారతం కాలానికి చెందిన ప్రదేశాలు ఇప్పుడు ఏ ఏ పేర్లతో ఉన్నాయో ఏమైనా మ్యాప్ చేసారా? తెలిస్తే వివరం గా ఒక టపా రాయండి.

చీర్స్
జిలేబి.

Reply

జిలేబి గారు,

ధన్యవాదాలు.

ఇన్వెస్టిగేషన్ అంటూ ఏమీ లేదండి.పురాణాలు కథలంటే ఎక్కడలేని ఆసక్తి ఉంది.భవిష్య పురాణం చదువుతూంటే పృథ్వీరాజు ప్రస్తావన కనిపించి ఆశ్చర్యపోయాను. రకరకాల గాథలలో నిండిన అతని చరిత్రను అర్థం చేసుకోవడానికి చాలా సార్లు చదవాల్సి వచ్చింది.చదివింది అర్థమయ్యాక మన చరిత్ర పుస్తకాలలో పృథ్వీరాజు జీవితం ఎలా నిక్షిప్తమయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేశాను.

రామాయణ మహాభారత కాలాల్లో ఉన్న ప్రదేశాల గురుంచి ఇదివరకే రెండు టపాలు వ్రాశాను.

http://bhava-nikshipta.blogspot.in/2009/07/blog-post.html

http://bhava-nikshipta.blogspot.in/2009/07/2.html

Reply
February 17, 2013 at 9:25 PM

మీ పరిశోధన చాలా లొతుగా సాగుతుంది
వ్యాసకృతమైన ,ప్రక్షిప్తాలు లేని భవిష్యపురాణం బ్రిటన్ లో మ్యూజియంలో ఉందంటారు. అది తేగలిగినవారుంటే బాగుండు.

Reply

దుర్గేశ్వర గారు ,
మీ కామెంటుకు నా కృతజ్ఞతలు. ఇన్నాళ్ళూ ఆంగ్లేయులు మన దేశ సంపత్తినే కొల్లగొట్టారనుకున్నాను. అయితే పురాణాలు కూడా పట్టుకెళ్ళారన్నమాట.ఎంతైనా వాళ్ళకున్న అక్కర మనకు లేకపోయింది.

Reply
Post a Comment