ఈ అవమానాలు మనకు కొత్తా ?!

      మొన్నటికి మొన్న కడప జిల్లా మైదుకూరులో, తెలుగులో మాట్లాడిన ఇద్దరు విద్యార్థుల మెడలో 'నేను తెలుగులో మాట్లాడను ' అని వ్రాసున్న పలకలు వేలాడదీయించి స్కూలంతా తిప్పించిన ఉపాధ్యాయుని ఉదంతం విన్నాం.అది మర్చిపోకముందే దాన్ని మించిన దారుణం విజయవాడలో నిన్నతొంగిచూసింది.

పాఠశాలలో ఉపాధ్యాయురాలు అడిగిన ప్రశ్నకు తెలుగులో సమాధానమిచ్చిన నేరానికి,ముగ్గురు పిల్లలు తమ బట్టలు విప్పి బయట నిలబడాల్సి వచ్చింది.అవమానం భరించలేక ఓ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటే అప్పుడు విషయం బయటికి పొక్కింది.మొదట బెట్టు చేసిన యాజమాన్యం,వెల్లువెత్తిన నిరసనలకు,ఒత్తిళ్ళకు తలొగ్గి ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది.యథాప్రకారంగా తప్పులన్ని టీచర్ల పై నెట్టి,తమకేమీ తెలియదని తప్పించుకుంది.అయితే తమకు జీతమిచ్చే యాజమాన్యం అదేశాలకు అనుగుణంగానే సదరు ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు అలా చెయ్యాల్సి వస్తున్నారు గాని,అదంతా తెలుగుభాష పై వాళ్ళకున్న అకారణ ద్వేషం అనుకోలేం.మైదుకూరులో సెయింట్ జోసెఫ్ స్కూల్,విజయవాడలో సెయింట్ ఆన్స్ స్కూల్..వెలుగులోకి వస్తున్న ఇటువంటి సంఘటనలు క్రిస్టియన్ మిషినరీ స్కూల్లల్లోనే జరుగుతూండటం కొసమెరుపు.కేవలం ఆ పాఠశాలల్లోనే ఈ దురాగతాలు జరుగుతాయని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ,మిషినరీ స్కూల్లు ఈ విషయంలో రెండాకులు ఎక్కువే చదివాయని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను.

అయితే ఈ అవమానాలు మనకు కొత్త కాదు.తెలుగులో మాట్లాడరాదని హుకుం జారీ చేసి,మాట్లాడితే జరిమానాలు, శిక్షలు విధించే పాఠశాలలు మన రాష్ట్రంలో కోకొల్లలు.సెయింట్ ఆన్స్ స్కూల్లోని ఈ నిబంధనలు ఈ మధ్య కొత్తగా ప్రవేశపెట్టినవి కావు.ఎన్నో ఎళ్ళుగా అమల్లో వున్నవే.మనకు చుచాయిగా అయినా తెలిసిన విషయాలే.కాబట్టి ఇప్పుడు కొత్తగా 'హవ్వ హవ్వ ' అని బుగ్గలు నొక్కుకొని మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.కాకపోతే ఇటువంటి పెడ ధోరణులు అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవల్సిన అవసరం చాలా వుంది.ఊహ తెలిశాక పిల్లలు తమ భావాల్ని వ్యక్తపరిచేది మాతృభాషలోనే.ఆ భాషని చిదిమేసి,పదజాలాన్ని రూపుమాపి,' అమ్మా' అనే బిడ్డ ఏడుపుని కూడా,తెలుగులో కాక ఇంగ్లీష్ లోకి అనువదించి,మార్చి ' ఓ మై గాడ్ ' అనేలా చేయాలనే తపన ప్రైవేటు పాఠశాలల్లో మితిమీరిపోతోంది. ఆ దుస్థితికి మనం దిగజారిపోకుండా చూసుకోవాలి.చిన్ననాటి నుండే తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లల్లో పెంపొందించి,తెలుగు లో మాట్లాడటం,ఆలోచించటం,పుస్తకాలు చదవటం నేర్పించాలి.మనకు మాత్రమే సొంతమైన కమ్మని పద్యాలని కొన్నైనా కంఠతా పట్టించాలి.' మా తెలుగు తల్లికి మల్లేపూదండ ' పాట వింటే గర్వంతో గుండె ఉప్పొంగి,ఉద్వేగంతో కళ్ళలో నీళ్ళు తిరిగే అభిమానం పిల్లల్లో కలగాలి.ఆ బాధ్యత తల్లిదండ్రులందరి మీదా ఉంది.దురదృష్టవశాత్తూ ఇద్దరు చదువుకున్న తెలుగువాళ్ళు ఒకరికొకరు తారసపడినా ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు.ఈ జాడ్యాన్ని తొలగించుకోవాలి.మన భాషను మనమే గౌరవించుకోకపొతే పలుచనైపోతాం.కన్నతల్లిని,సొంత ఊరిని,మాతృభాషని అవమానించేవాళ్ళు పశువులతో సమానం.

ఎన్ని అవమానాలు జరిగినా,దున్నపోతు మీద జడివాన కురిసినట్లు కొన్ని సంవత్సరాలుగా తెలుగుభాష విషయంలో నిస్తేజంగా వున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే కళ్ళుతెరిచి కలయచూసే ప్రయత్నం చేస్తోంది.పాఠశాలల్లో ' మా తెలుగుతల్లికి మల్లెపూదండా ' పాడాలనే నిబంధన విధించింది.విద్యార్థులను దండించిన ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకుంటూ సంఘటన పునరావృతమైతే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది.ఇది ముదావహం.అప్పుడే భవిష్యత్తులో మరే పాఠశాల ఇటువంటి దుస్సాహసానికి పూనుకోదు.ఈ చొరవను అధికార కార్యకాలాపాలను తెలుగులో జరిపే విషయంలో కుడా చూపించాలి.తెలుగుతల్లి విగ్రహాలు ధ్వంసం చేసి,' మా తెలుగు తల్లికి ' పాటని అడ్డుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవలి.ప్రాచీనభాష హోదా విషయమై న్యాయస్థానంలో ఉన్న పేచిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.అప్పుడే తెగులు పట్టిన తెలుగుజాతికి విముక్తి.

జై తెలుగుతల్లి !3 comments

మనందరి మనస్సుల్లో ఉన్న బాధని చక్కగా వ్యక్తం చేశారు. మన బ్లాగుల్లో ఉన్న వాళ్ళు మాతృ భాషాభిమానంతోనే (మూడొంతులు) బ్లాగు తెరిచి ఉంటారు అనుకుంటున్నాను. కానీ బయట జనాల ఉద్దేశ్యం ఎలా ఉందో తెలీటం లేదు.

Reply

ఇది నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను...అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో ఇదే తంతు.. తెలుగులో మాట్లాడితే ఫైన్ కట్టాల్సి వుంటుంది..
మాది చాల చిన్న స్కూల్..క్లాసు కి 20-25 మంది మాత్రమే వుంటారు..తెలుగులో మాట్లాడితే ఫైన్ వసూలు చేసేవారు..నేను aug 15th, Jan 26th కి తెలుగులో స్పీచ్ చెప్తానంటే వద్దు..ఇంగ్లీష్ లోనే చెప్పాలి అని ఫోర్స్ చేసేవారు..
మా నాన్నగారు వెళ్లి అడిగితే..మీ పిల్లవాన్ని తెలుగు లో మాట్లాడమని, స్పీచ్ ఇవ్వమని మీరు చెప్పారు...కాని మిగితా పిల్లల తల్లిదండ్రులు పోరు పెడుతున్నారు..."మేము మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించింది తెలుగులో మాట్లాడటానికి కాదు..
వాడు ఇంగ్లీష్ లో మాట్లాడాలి..మమ్మీ, డాడీ అని పిలవాలి...ఇంట్లో కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి" అని అంటున్నారు...మేము ఎం చేస్తాం అని చేతులెత్తేశారు.. పిల్లలకి సరైన తోవ చూపించాల్సిన తల్లిదండ్రులు, బడి వాళ్ళే...వాళ్లకి తెలుగు అంటే అణగారిన భాష అన్నట్లుగా చూపించటం వల్ల..ఈ మధ్యకాలంలో సరిగా ఒక్క వాక్యం కూడా తెలుగులో వ్రాయలేక, చదవలేక, మాట్లాడలేకపోతున్నారు నేటి తరం పిల్లలు..
తెలుగు ఎంత తియ్యగా వుంటుందో ఈ తరం పిల్లలకి తెలియటం లేదు...తెలుగు చదివినా..వ్రాసినా..మాట్లాడినా అధ్బుతంగా వుంటుంది...ఆ అనుభూతే వేరు..

Post a Comment