రాత్రి చెరలో మగ్గిపోయిన
వియత్సుందరి విరహోత్కంఠితను
విభాతనాధుడొచ్చి విడిపించాడు
ఆకాశం సిగ్గుపడితే
దిక్కుల మేనంతా ఎర్రబడింది.
వియద్వీధి వాకిట్లో విహరించే కొంగలు
ధవళ కాంతుల దివ్యతోరణం కడుతున్నాయి
కెంజాయ ఎండల కాళ్ళ పారాణి దిద్దుకొని
మిసిమి మేఘాలు పసిపాపల్లా పరుగులుతీస్తున్నాయి
కొండల మీదుగా తేలి వచ్చేకూని రాగాల శీత గాలి
వన్నెచిన్నెల కన్నెపైరులకి నేర్పుతోంది కొత్త నాట్య శైలి
ఆలయకోనేట్లో అరవిరిసిన తామర తరుణులు
తుషార జలకాలాడి తలలెత్తి చూస్తున్నాయి
తరుశాఖ పత్రాల చివుళ్ళ పెదవులపై
తళుక్కుమంటూన్న హిమబిందువులు
అగాధాల సంద్రంలో అవతరించిన ముత్యాలైనాయి
చౌరస్తాకూడలిలో చితికిపోయిన బడుగూపేక
చింతల చిదుగులు పేర్చి ఆశలనెగళ్ళు వెలిగించి
భయం చలిని పోగొట్టుకుంటున్నారు
భవితపై భరోసా నింపుకుంటున్నారు
వీధిమలుపులో విరిగిన ఫ్లాట్ ఫాంపై
వయసుడిగిపోయిన భిక్షువర్షీయసి
ఆకలి సెగల ఆవిర్లుకక్కి
మూలబడ్డ ధూమశకటంలా
ముడుచుకూంటూ మూలిగింది
పల్లెటూళ్ళో పశువుల పాకలో
తల్లిపాలకై చిట్టిలేగ సంచలించి చిందులేసింది
కలతనిద్రలో ఉలిక్కిపడ్డ పసిపాప
మాతృమూర్తి హృదయంపై వెచ్చగా వొత్తిగిల్లింది.
గవాక్షాల సరిహద్దులు దాటి
గదిలోకి ప్రసరించే గోర్వెచ్చని మయూఖాలు
మారుని శరాలై గిలిగింతలు పెడుతుంటే
ప్రియనాథుని పరిష్వంగంలో త్రుళ్ళిపడిందో పెళ్ళికూతురు
నిద్రాభూతం తరుముతూంటే
పరీక్షల ప్రేతం భయపెడుతూంటే
కంబళి ఖడ్గం చెలాయిస్తూ
పుస్తక మంత్రం పఠిస్తూ
కుస్తీపడుతున్నాడో కుర్ర పహిల్వాను.
జగమంతా పరుచుకున్న జలతారు మంచుతెర
జీర్ణకాలాంబరంలా జరీవూడుతోంది
తమస్సుల నిశీధి తొలగిపోయి
ఉషస్సుల సత్వం వెలుగుచూస్తోంది
పేడనీళ్ళ పసుపుకళ్ళాపి వొళ్ళంతా పులుముకొని
రంగేళి ముగ్గుల రతనాల చీర నిండుగా చుట్టుకొని
గొబ్బెమ్మ సింధూరం నొసటన గుండ్రంగా దిద్దుకొని
తెలుగు లోగిళ్ళలో భూమాత కొత్త పోకళ్ళు పొయింది.
వర్గసంబంధిత టపాలు
- భగ్నప్రేమ01/09/2011
- ఓ ప్రేమ కథ !!26/04/2011
- తెలుగుపీపుల్.కాం లో నా కవిత - సాగరతీరాన24/12/2009
- తెలుగురత్నలో నా కవిత - అమ్మ23/12/2009
- తపస్వీ.. కళ్ళుతెరు ! 07/05/2009
Subscribe to:
Post Comments (Atom)
8 comments
wonderful imagery
Replywonderful
చాలా బాగుంది.
Replyరిక్టర్ స్కేలు పై మీ కవిత తీవ్రత యేడు పైగానే వుంది.
Replyబాగుంది.
మీ నాన్నగారి వలన సంక్రమించిన సాహితీ వారసత్వం, మీ సాధన వలన చేకూరిన సారస్వతం, వైవిధ్యంగా ఉన్న మీ రచనలు [కవితలు,పుస్తకం.నెట్ లో సమీక్ష..], చిత్రలేఖనం మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తూ.. ఇక ఈ కవితలో "చిట్టిలేగ", "జీర్ణకాలాంబరం" వంటి ప్రయోగాలు చిక్కగా బాగున్నాయి.
Replyబ్లాగులు చూడటం తక్కువైనందువలనా, బ్లాగులన్నవి అసంఖ్యాకంగంగావున్నందునా ఒక బ్లాగు గురించి తెలియటం ఆ బ్లాగరి వ్యాఖ్య వలననో, తెలుసుకున్న మరొకరి వలననోనే సాధ్యమౌంతుంది నా విషయంలో. నిన్ననే మీ బ్లాగులో కొన్ని చదివాను. వీలుని బట్టి చూస్తానికపై. అభినందనలు.
బొల్లోజుబాబా గారు,చిలమకూరు విజయమోహన్ గారు,వెంకటరమణమూర్తి గారు,ఉష గారు అందరికీ ధన్యవాదాలు.
Reply@ఉషగారు,మీ పొగడ్తలు నన్ను కొద్దిక్షణాలు పాటూ ఉక్కిరిబిక్కిరి చేశాయి.అవి తలకెక్కించుకోకుండా చూసుకుంటాను.
బాగుందండి!
Replyమీ కవిత బావుంది.
ReplySrikanth Garu, mee kavithalanni chala hatthukunelaa unnayi, brilliant !!!! Keep writing
Reply