యండమూరి వీరేంద్రనాథ్ - ప్రేమ


నభైలలో అనుకుంటా,ఆంధ్రభూమి వారపత్రిక నలుగురు లబ్దప్రతిష్ఠులైన రచయితల(త్రుల)తో 'ప్రేమ' అనే నవలకు శ్రీకారం చుట్టింది. అలాగని ఇది గొలుసునవల కాదు. నలుగురూ భిన్న కథాంశాలు ఎన్నుకొని, ప్రేమని ఎలివేట్ చేస్తూ, అదే పేరుతో నవల వ్రాయాలి. ఎవరి కథలు వారివే అన్నమాట. అలా వ్రాసిన నవలే ఇది. ఆ నలుగురిలో నాకు గుర్తున్నదని ఇద్దరు. ఒకరు యద్దనపూడి, ఇంకొకరు యండమూరి. ప్రేమ మీద యండమూరి చేసిన రచనలలో సాదాసీదాగా అనిపించిన రచన ఇది.

కథ

వేదసంహిత అనే అందమైన అమ్మాయి అద్దె ఇల్లు కోసం ఆదిత్యపురం అనే గ్రామానికి రావటంతో కథ ప్రారంభం అవుతుంది.అంత అందమైన ఒంటరి ఆడపిల్లకు ఆశ్రయం ఇవ్వటానికి అంతా సందేహిస్తే,చలం అనే యువకుడు ఆమె అందానికి ముగ్ధుడై అమె పల్లెటూళ్ళో రీసెర్చ్ చెయ్యటానికి వచ్చిందని అబద్ధం చెబుతాడు.సోమయాజులు దయతలచి తన ఇంట్లో ఆమెకు చోటు కల్పిస్తారు.


చలం ఆమెను మూగగా ప్రేమిస్తూంటాడు.సోమయాజులు గారి కూతురు భారతి.ఒకరోజు అందరూ పొలాల్లో సంతోషంగా గడుపుతున్న సమయంలో,హఠాత్తుగా భారతి జలగ బారిన పడుతుంది. ఏం చెయ్యలో పాలుపోక అందరూ వృధా ప్రయత్నాలు చేస్తూంటే,అరుణ్ అనే యువకుడు వచ్చి ఆమెను రక్షిస్తాడు.వేదసంహితతో అతనికి పరిచయం కలుగుతుంది.అతను అంత్రోపాలజీలో మాస్టర్స్ చేసివుండటంతో వారి మధ్య కబుర్లు పెరిగి ఊళ్ళో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.ఇద్దరూ కలిసి పని మీద ఒకరోజు పట్నం వెళ్తారు.సంహిత అరుణ్ కి తెలియకుండా తన నగలు కుదువపెట్టబోతుంటే, అతను వారించి ఆమె నగలు ఆమెకు ఇప్పిస్తాడు.వారిద్దరూ కలిసి తిరగడం చూసి చలం ఊక్రోషానికి గురవుతాడు.తన ప్రేమను వెల్లడి చేస్తాడు.సంహిత షాకయ్యి తను వివాహితురాలని చెబుతుంది.ఒక వ్యక్తి మీద,ఒక వ్యవస్థ మీద తను వ్రాసిన థీసిస్ అతని చేతిలో పెట్టి అది చదువమంటుంది.చలం కొయ్యబారిపోతాడు.ఓ సాయంత్రం సంహిత కాఫీ తేవడానికి వెళ్ళినప్పుడు ఆమెకు వచ్చిన ఉత్తరం చదువుతాడు అరుణ్.ఆమె అతనితో గొడవేసుకుంటుంది.ఆమె మీద తనకున్న వ్యామోహాన్ని వ్యక్తం చేస్తాడు అరుణ్.వాదులాట జరిగి కోపంతో వెళ్ళిపోయిన అతను,ఆమె మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తాడు.


అభిషేక్ ఆదిత్యపురం వస్తాడు.వేదసంహిత భర్తగా అతన్ని అందరికీ పరిచయం చేస్తాడు చలం. అభిషేక్ మెక్సికో దీవుల్లో స్థిరపడ్డ భారతీయ సంతతి డాక్టర్. అపాచి తెగకు నాయకుడు. చట్టబద్ధంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారవుతాడు. అతన్ని వదిలించుకోవాలని ప్రభుత్వం కుట్రపన్ని బంధించి, ఉరిశిక్ష విదించి వో దీవికి పంపిస్తుంది. అక్కడి జైలర్ హెర్మన్ కార్టిస్.అతను మహాకౄరుడు. అభిషేక్ తన ప్రవర్తనతో అతన్ని మార్చాలని ప్రయత్నిస్తాడు. ఈ లోగా అభిషేక్ ను విడిపించుకు వెళ్ళాలని అపాచీలు మెరుపుదాడి చేసి విఫలులవుతారు. దాడిలో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్న కార్టిస్ కి రక్తదానం చేసి,శస్తచికిత్స చేసి,అతని ప్రాణం నిలబెడతాడు అభిషేక్. కార్టిస్ విచలితుడౌతాడు. అతనికి ప్రాణభిక్ష పెట్టి దూరంగా పంపిచేయాలని నిర్ణయించుకుంటాడు. అభిషేక్ ససేమిరా అంటాడు.విసిగిపోయిన కార్టిస్ అతని ఆఖరి కోరిక ఏమిటని అడుగుతాడు.తన పూర్వికులది భారతదేశంలోని అందమైన గ్రామం అని,ఆ గ్రామంలో గడపాలని తన కోరికని చెబుతాడు అభిషేక్. కార్టిస్ అతన్ని నెలరోజుల పాటూ భారతదేశం పంపిస్తాడు. వేదసంహిత అతని మీద రీసెర్చ్ చేసి ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా అతనికి స్నేహపాత్రమవుతుంది. అతనిచ్చిన గుర్తుల ఆధారంగా ఆమే ఆదిత్యపురం గ్రామాన్ని ఎన్నుకొని అతని రాకకోసం ఎదురుచూస్తూంటుంది. ఈ విషయాలు ఒక్క చలంకి తప్ప ఇతరులకి తెలియవు. అందరూ రీసెర్చ్ వర్కు మీదే సంహిత కొన్ని రోజులు గ్రామంలో ఉంటోందని, అభిషేక్,సంహిత భార్యభర్తలనే భావిస్తారు.

ఆదిత్యపురం వచ్చిన అభిషేక్ తన మనస్తత్వంతో అందరినీ ఆకట్టుకొంటాడు. తనను జలగబారి నుండి రక్షించాడన్న కృతజ్ఞతతో భారతి అరుణ్ ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలియని సోమయాజులు ఆమెకు పెళ్ళి సంబంధం ఖాయం చేసి ఏర్పాట్లలో ఉంటారు. భారతి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అభిషేక్ తన వైద్యంతో ఆమె ప్రాణం నిలబెట్టి,జరిగిన విషయం తెలుసుకొని అరుణ్ నిజస్వరూపం ఆమెకు తేటతెల్లమయ్యేలా, సంహితతో కలిసి ఒక నాటకం ఆడుతాడు.భారతి అరుణ్ ని ఛీకొడుతుంది. సోమయాజులు గారి కుటుంబం పరువు నిలబడుతుంది.

అభిషేక్,సంహిత ఆదిత్యపురం విడిచి వెళ్ళాల్సిన రోజు రానే వస్తుంది. సంహిత దుఃఖితురాలవుతుంది. ఇద్దరూ ఒకటవుతారు. భారమైన హృదయాలతో ఐ.ఏ.ఎస్ ఇంటర్వ్యూ కోసం సంహిత ఒకవైపు,కార్టిస్ కిచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం మరో ట్రైన్ లో అభిషేక్ ప్రయాణమవుతారు. అప్పుడు చూస్తాడు చలం ఆమె మెడ మీద మచ్చని. అయితే అది త్రాగుబోతైన ఆమె అసలు భర్త చేసిన గాయం అన్న నిజం, అతనికి ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోతుంది.

కథనం

నవలలో పల్లెసీమల్లోని అందాలని,అలవాట్లని వర్ణించిన విధానం,అంత్రోపాలజి పరిణామక్రమాన్ని వివరించిన తీరు నాకు బాగా నచ్చాయి.మిగతా రచనంతా సాధారణంగా ఉంటుంది. కథారంభంలో సంహితని సృష్టించినప్పుడు ఆమె అందానికి వివశుడై బ్రహ్మదేవుడు ఆశువుగా శృంగార పద్యం చెబితే,సరస్వతీదేవి ఆగ్రహించి ఆ అమ్మాయి అందచందాలని ఏ మాత్రం గుర్తించలేని వ్యసనపరుడైన భర్త దొరకాలని శపిస్తుంది. ఆ భాగం చదివాక,ఇక నవలలో సంహిత అష్టకష్టాలు పడే సన్నివేశాలు వస్తాయని,ధైర్యంతోనే ఆమె తన జీవితాన్ని నిర్మించుకొని ప్రేమను పొందుతుందని ఊహించాను. అటువంటి సన్నివేశాలు ఎక్కడా లేవు.సంహిత పాత్ర పరిధిని తగ్గించి ప్రేమతత్వాన్ని బోధించే భారాన్ని మొత్తం అభిషేక్ మీద పేట్టేశారు రచయిత. సంహిత అభిషేక్ ని ఆరాధిస్తూ మిగిలిపోతుంది.ఆ మాత్రం దానికి కథానాయికకు అంత బిల్డప్ ఇవ్వాల్సిన పని లేదు. ఇది ప్రధానమైన లోపం అనుకోవచ్చు. ప్రేమ అనగానే మనకు సహజంగా స్పురించే యువతీయువకుల మధ్య ప్రేమని ఇందులో ఎక్కడా కూలంకుషంగా చర్చించలేదు. భారతి -అరుణ్,సంహిత -చలం ,సంహిత - అరుణ్ మధ్య అలాంటి సన్నివేశాలు వచ్చినా రచయిత లోతుగా వెళ్ళి విమర్శలు చెయ్యలేదు. విశ్వజనీయమైన మానవతా విలువలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి అభిషేక్ పాత్ర ద్వారా అదే చెప్పిద్దామని ప్రయత్నించారు.ఇక కథానాయకుడికి మెక్సికో బ్యాక్ డ్రాప్ పెట్టడం కూడా ఉరిశిక్ష ముందు 'నెలరోజుల ' సాధారణ జీవితాన్ని ఇవ్వటానికే.మనదేశపు చట్టాలతో అది సాధ్యం కాదు కదా. పైగా ఉరిశిక్షకు గురైన కథానాయకుడు విదేశాల నుండి స్వదేశానికి వచ్చి ప్రేమతత్వాన్ని చాటితే, కథానాయకుడి పరిధి,చుట్టూ అల్లుకున్న కథ పరిధి పెరిగి,ఇంకా బలోపేతమవుతుందని భావించి ఉండవచ్చు.

'ప్రేమ' అనే టాపిక్ మీద యండమూరి ఇంతకంటే మంచి రచనలే చేశారు.చాలమందికి ఏ ' వెన్నెల్లో ఆడపిల్లో ', ' ప్రియురాలు పిలిచే ' నచ్చినా నావరకు బాగా నచ్చిన పుస్తకం అంటే ' థ్రిల్లర్ ' మాత్రమే.ప్రేమంటే ఏమిటో తెలుసుకోడానికి,ప్రేమలో తన నిజాయితీ ఎంతో నిరూపించుకోవడానికి అనుదీప్ అనే కుర్రాడు ఏడు సంవత్సరాలు తపస్సు చేసి,ఆ తపశ్శక్తితో విద్యాధరి అనే అమ్మాయి ప్రేమను పొందాలని ప్రయత్నించి,విఫలుడై ,స్వశక్తితోనే దాన్ని సంపాదించే క్రమంలో చివరకు ప్రాణాలే కోల్పోతాడు. వెళ్తూ వెళ్తూ తన తాలూకు జ్ఞాపకాలు ఆమెను ఏమీ బాధించకుండా కాలగతినే మార్చి జరిగినదంతా కలే అనే భ్రమకు ఆమెను గురిచేస్తాడు. ఈ నవలని రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా ముత్యమంతముద్దు అనే పేరుతో తెరకెక్కించారు.సీత కథానాయిక. ఆఫ్ కోర్స్ సినిమాలో క్లైమాక్స్ మార్చారులెండి. అందులో కథానాయకుడు బ్రతుకుతాడు. లేకపోతే జనం చూడరుగా.


12 comments

May 17, 2010 at 1:26 PM

వెన్నల్లో ఆడపిల్ల బాగుంటుంది. ధ్రిల్లర్ ఇంకా బాగుంటుందండి!:)

Reply
May 17, 2010 at 2:02 PM

ఒకప్పుడు ఏదో మాగజైన్ లో, ప్రేమ అనే పేరుతోనే ముగ్గురు టాప్ రచయితలతో సీరియల్స్ రాయించారని విన్నాను.
౧) యండమూరి ...కథ పైన మీరు చెప్పినదే..
౦) యద్దనపూడి - - ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ప్రేమని హై లైట్ చేస్తుంది. Heroine is a strong lady..and falls in love with the grand son of the house owners.and this runs as a seperate track altogether.
౦) వెన్నెలకంటి వసంత సేన. - - idi ఒక మామూలు అమ్మాయి కథ. జీవితం లో ఎంతో పైకి రావాలని తపన పడుతూ కూడా, తన జీవితం లో ఎదురయ్యే ఆకర్షణలకి లొంగిపోతూ..బాధ పడుతూ..బయట పడాలి అని బెంగపడుతూ..మళ్లీ మళ్లీ ఓడిపోయే ఒక బలహీన మనస్కురాలి కథ.

అయితే..కథ ముగింపు కి వచేసరికి, ఆ అమ్మాయి ఆలోచనా పరిథి లో వచ్చే మార్పు..ఒక వ్యక్తీ ఆ అమ్మాయిని influence చేసిన విధానం అద్భుతం గా ఉంటాయి,. మనం కథ చదువుతున్నప్పుడు, ఏదో ఒక చోట 'అరె ..మనం కూడా ఇలాంటిది ఎక్కడో చూసామే..' అనిపించకుండా ఉండదు.
బ్రహ్మాండమైన శైలి ఈ రచయిత సొంతం.

Reply
May 17, 2010 at 4:46 PM

నాకు మాత్రం దేనికి అదేనండి.... మీరు వ్రాసిన విధానం బాగుంది

Reply

ఆదిలక్ష్మి గారు,మానస గారు,పద్మార్పిత గారు నెనర్లు,

@మానస గారు,ప్రేమ అనే పేరుతో వ్రాసింది ముగ్గురేనా? నలుగురని చదివినట్లు గుర్తు.ఇంకొకరు మల్లాదేమో.యద్దనపూడి గారి రచన కొంచెం చదివాను.వసంతసేన గారి రచన గురుంచి తెలియచేసినందుకు కృతజ్ఞతలు

@పద్మార్పిత గారు, టినేజ్లో చదివిన తొలిప్రేమ కథ థ్రిల్లర్.ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావటానికి చాలా రొజులు పట్టింది.అందుకే అ నవల చాలా ఇష్టం నాకు.

Reply
May 17, 2010 at 5:40 PM

ముగ్గురనే గుర్తు నాకు. ఆ ముగ్గురి నవలలనీ కలిపి..విశాలాంధ్ర వాళ్ళు ఒకే బుక్ కింద రిలీజ్ చేసారు.
అదే ఉంది నా దగ్గర. :).
నాకు వెన్నెలకంటి గారి "ప్రేమ" బాగుందనిపిస్తుంది..మిగిలిన రెండింటి కంటే కూడా.

Reply
May 17, 2010 at 7:20 PM

chala baga visleashimcharu, meeru good.

Reply
May 17, 2010 at 8:46 PM

శ్రీకాంత్ గారు...

ప్రేమ నవల వచ్చింది ఆంధ్ర భూమి కాదు... ఆంధ్ర జ్యోతి వార పత్రికలో. రాసింది నలుగురు కాదు. ముగ్గురు.

౧. యండమూరి వీరేంద్రనాథ్
౨. యుద్ధనపూడి సులోచనారాణి
౩. వెన్నెలకంటి వసంత సేన.

Reply
May 17, 2010 at 8:49 PM

వీలైతే వెన్నెల్లో ఆడపిల్ల, థ్రిల్లర్ మరియు ముఖ్యం గా ఆనందో బ్రహ్మ చదవండి.

Reply
May 17, 2010 at 11:27 PM

ఆ వెన్నెలకంటి వసంతసేన ఎవరో కాదు .. యండమూరి వీరేంద్రనాధే అని అప్పట్లోనే రూమర్లొచ్చాయి. వాస్తవమెంతో మరి. ఒకటి మాత్రం నిజం. సదరు వసంతసేన రెండే రెండు సీరియల్స్ రాసింది. ఆ శైలి యండమూరినే పోలి ఉంటుంది.

Reply

హను గారు,అబ్రకదబ్ర గారు,స్నేహితుడు గారు నెనెర్లు

@హను గారు థాంక్యు.

@మానస గారు..ముందే ఈ విషయం తెలిసివుంటే ఆ కాపీనే కొనేవాన్ని.

@అబ్రకదబ్ర గారు..వసంతసేన గారి పేరు విన్నట్లే వుంది కానీ ఆవిడ / అతని నవలలేవీ చదవలేదు.

@స్నేహితుడు గారు..మీరు చెప్పినవన్ని నేను చదివేశాను.' ప్రేమ ' ఈ మధ్యనే చదివాను.అవి ఆకట్టుకొన్నంతగా ఈ నవల నన్ను ఆకట్టుకోలేదు.

Reply
May 26, 2010 at 5:28 PM

" ప్రేమ " పేరుతో ఒకే విషయం మీద నవల వ్రాసినది మాత్రం ముగ్గురే..పైన కొందరు మిత్రులు చెప్పినట్లు. ఇక "వెన్నలకంటి వసంతసేన " పేరుతో సీరియల్ వ్రాసినది మాత్రం అప్పటి " ఆంధ్రజ్యోతి " సబ్ ఎడిటర్ అయిన తోటకూర రఘు గారు, వసంతసేన పేరుతో సీరియల్ వ్రాసారు..80 లలో కాదు 1993 లో ధారావాహికంగా వచ్చింది అప్పట్లో వెన్నెలకంటి వసంత సేన సీరియల్ సంచలనం రేపింది అని చెప్పొచ్చు.. కొందరు రంగనాయకమ్మతో పోల్చారు కూడాను. అయితే యండమూరి సీరియల కన్న కూడ వెన్నెలకంటి వసంతసేన సీరియలే చాలా బాగుంటుంది..

Reply

కమల్ గారు నెనెర్లు,

మీరు ఇంతమంది చెబుతున్నారు కాబట్టి నాక్కూడా వెన్నెలకంటి వసంతసేన గారి ప్రేమ నవల చదవాలనే కోరిక పుడుతోంది

Reply
Post a Comment