ఓ ప్రేమ కథ !!



చుక్కలు రాలిన వో చీకటి రాత్రి
హోరున గాలి అరుస్తూంటే
జోరుగ వర్షం కురుస్తూంటే
నిద్రాణమై ఉన్న నగరంలో
నిబిడీకృత హాస్టల్ గదిలో
మనసు చచ్చిన
ఓ మానవ దేహం
మృతశరీరమై వ్రేలాడుతోంది !
మూగగా గాలితో ఊసులాడుతోంది !!

పీక్కుపోయిన పిచ్చోడి వదనం
కత్తుల జుత్తుల గెడ్డపు కదనం
గుంటలు తొక్కిన గుండ్రటి కళ్ళు
ఎముకలు పోగైన ఎర్రటి వొళ్ళు
ప్రపంచానికి ప్రశ్నలు వేస్తున్నాయ్ !
సంప్రదాయాన్ని సవాల్ చేస్తున్నాయి !
కాలం చేసినా కాంతులు తగ్గని
ఆ పవిత్ర శవం ఓ యువకవిది !
ఆశలు తీరని ఓ ప్రేమికుడిది !!

పూర్వాశ్రమంలో ఆ అబ్బాయి
పల్లెటూరి స్వేచ్ఛా పావురాయి
భావుకత్వం అతని సౌందర్యం
మంచితనమే మరో ఆహార్యం
పై చదువుల కోర్కెలు హృదిలో కదలి
పట్నం చేరాడు కన్నతల్లినొదలి
అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి
తొలకరిప్రాయంలో తొలిప్రేమకు
కుర్రాడయ్యాడు కొత్తఖైదీ !

ఆతని ప్రేయసి అందాల బొమ్మ
అపరంజి సోకుల పున్నమి కొమ్మ
నగుమోమే ఆమె నయగారం
నాట్యశాస్త్రం కుసుమ సింగారం
అబ్బాయి తెలివికి ఆశ్చర్యపోయింది
మాటలు కలుపుతూ ముచ్చటపడింది
స్నేహంతో మొదలైన పరిచయం
శృతెక్కువై సరిహద్దులు దాటి
చేసింది మనస్సులు ప్రేమమయం

మనసులొకటైన ప్రేమికులిద్దరూ
మిన్నూమన్నూ తమవేనన్నారు
ఎడబాయని బాసలే చేసుకొని
ఎదనిండా వొకళ్ళని నింపుకొని
ప్రేమైకరాగాలు పల్లవించారు
ప్రణయలోకాలలో పర్యటించారు
వసంతాలన్నీ విరబూయించి
వెలిగిపోయారు వీడని జంటై
కలల ధరిత్రికి కన్నుల పంటై

అమ్మాయి తండ్రి అపరకుబేరుడు
ఆత్మీయతలంటే అసలెరుగడు
అంతస్తు ఆత్మలో సగభాగం
కులతత్వం అతనికున్న రోగం
కూతురు ప్రేమ తెలిసి కస్సుమన్నాడు
కలనైనా ప్రియుని కలువరాదన్నాడు
చదువాపించి చూపులు జరిపించి
తీశాడు తనయ తలపుల ఆయువు !
మరొకరితో నిర్ణయించి మనువు !!

నివ్వెరపోయిన నిత్యచెలికాడు
వివాహం కోరి వెళ్ళి అడిగాడు
కులం కలవని అంతస్తుకందని
కుర్రాన్ని చూసి కళ్ళెర్ర చేసి
పట్టి గెంటించాడు ప్రియురాలి తండ్రి
ప్రేమ వ్యవహారలకు వొళ్ళుమండి
వ్యాధుడి వేటుకు వాలిన చిలుకలై
వేరుపడ్డారు ప్రేయసీ ప్రియులు
విధి ఆటల్లో వింత పావులై

చేసిన బాసలు చెదిరిపోయాయి
కోర్కెల మేడలు కూలిపోయాయి
మేలిమి కావ్యం మాసిపోయిసింది
మువ్వల సవ్వడి మూగబోయింది
వెర్రెక్కి కవి ఊరంతా తిరిగాడు
విఫలయత్నాలకు వగచి ఏడ్చాడు
విశ్రాంతి కరువై విరక్తి పరమై
వలపుల సఖుడు ఉరేసుకున్నాడు !
ఊహల జగతి ఊరేగి చేరాడు !

స్మృతులు ముసిరీ సమస్యలు కసిరీ
పగిలిపోయింది ప్రియసఖి హృదయం
ఎవరు చేస్తారు ఆమెకు న్యాయం ?
తిమిరం విడింది తెల్లవారింది
పట్నానికావల పెళ్ళివేదికలో
మంగళగీతాల మేళవింపులో
నవ వధువూపిరి నిలిచిపోయింది !
గగ్గోలు పెట్టిన కూతురు తండ్రిని
గరళం సీసా వెక్కిరించింది !!

సలీం అనార్కలి సమాధుల కథలు
మజ్ఞు లైలాల మారణ గాథలు
చరిత్రకందని చరితలు ఇంకా
పగిలించెనులే నెత్తుటి ఢంకా
తరాలు మారినా యుగాలు దొర్లినా
తేడాల జాడ్యం తొలగని లోకాన
విలాపమేనా వలపుకు సొంతం ?
పెద్దలకెందుకు ఇంతటి పంతం ?
ఇంకెన్నాళ్ళని ఈ విషాదాంతం ?

(1999లో వ్రాసిన కవిత)


7 comments

April 26, 2011 at 5:36 PM

శ్రీకాంత్ గారూ బాగా రాసారు అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటమే ..
చాలా చాలా బాగా రాసారు ..

కవిత చదివినంత సేపూ పంతాలకి బలైపోయిన నా స్నేహితుడొకడు కళ్ళముందు కనిపించాడు..
మీరెవరని ఉద్దేసించి రాసారో కాని , మీ కవితలో నా మిత్రున్ని సాక్షాత్కరించారు ..

కన్ను కప్పుకున్న కన్నీటి పొరొకటి బద్దలయ్యి బాధపెడుతోంది .


మీకో చిన్న విషయం
"అబ్బాయి తండ్రి అపరకుబేరుడు
ఆత్మీయతలంటే అసలెరుగడు"


అక్కడ అమ్మాయి తండ్రనుకుంటాను

Reply
April 26, 2011 at 5:57 PM

చావే చివరకు అనుకుంటే ప్రేమే కాదు ఏ సమస్యకు పరిష్కారం ఉండదు. చచ్చే ధైర్యం ఉన్నవాళ్ళకు ప్రేమను నిలబెట్టుకునే ధైర్యం లేదా??అయితే అది ప్రేమే కాదు..కేవలం ఆకర్షనేమో..ఎదిగి ఎదగని వయసులో ప్రేమో ఆకర్షనో తెలియక, ఒకవేళ ప్రేమే అయితే దానిని ఎలా నిలబెట్టుకోవాలో తెలియనంత కాలం శేవాలు వేలాడుతూనే ఉంటాయి. చచ్చి సాధించేముంది, నాలుగు రోజులు ఏడిచి అందరు మరిచిపోతారు, బతికే నిరూపించుకోవాలి. దేవదాసు కధలో ఎంత చేతకానితనం కనబడుతుందో...ఆ కధేనా ఆదర్శం?ప్రేమ విఫలమయితే ఏడుస్తూ, వూరు వూరు తిరిగి తాగి చచ్చిపో, ఇంకేమి లేవా లైఫ్ లో?
Life is a part of many things. A single part including love, marriage shouldn't occupy the whole space. If that does, we don’t know to balance our life. Of course it’s my personal opinion. Felt like expressing here.

Reply
April 26, 2011 at 6:42 PM

99 ? It was sure from the heart :).
and very honest too. Liked it.

Reply

@ స్వామి గారు,నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.పరోక్షంగా మీ స్నేహితుడి విషాదాన్ని గుర్తుచేసినందుకు క్షంతవ్యున్ని.కవితలో తప్పులని సరిచేశాను.

@ప్రవీణ గారు,మీ మాటలతో నేను ఏకీభవిస్తాను.ప్రేమ పేరుతో ప్రాణాలు తీసుకోవడం,వేరొకరి ప్రాణాలు తీయడం రెండూ నాకు నచ్చవు.ఇక ఈ కవితంటారా,పన్నెండేళ్ళ క్రితం నేను కుర్రతనంలో వ్రాసుకున్నది.అప్పటి అవేశకావేశాలకు,ఆలోచనలకు ప్రతీక మాత్రమే ఇది.

@మానస చామర్తి గారు,Thank you :-)

Reply

కథలో మంచి ఫీల్ ఉంది.కథనం బాగుంది

Reply
June 17, 2011 at 3:35 PM

ekkadi nundi vasthunnayi annayya meeku inni maatalu... Ila undi ani cheppadaniki matalu saripovu. antha baga rasaru.... :)

Reply

Dance is my life గారు,మీ అభిమానానికి కృతజ్ఞతలు.

Reply
Post a Comment