యాగంటి - బనగానపల్లె - బెలూం గుహలు

ప్రభుత్వోద్యోగిగా పనిచేసి, పదవీవిరమణ చెయ్యబోతున్న మా నాన్నగారిని కలవడానికి నేను మా తమ్ముడు గుంతకల్లు వెళ్ళాం. కార్యక్రమం ముగిశాక దగ్గర్లోని దర్శనీయ స్థలాలు చూడాలని ముందే నిర్ణయించుకున్నాం. యాగంటి,బనగానపల్లె,బెలూం గుహలు...ఇవన్నీ గుంతకల్లు నుంచి వందకిలోమీటర్లో పరిధిలో వుంటాయి కాబట్టి పొద్దున్నే బయలుదేరితే సాయంకాలానికి తిరిగివచ్చేయచ్చని నాన్నగారు చెప్పటంతో సరేనన్నాం. గుంతకల్లుకు ట్రాన్సఫరైన కొత్తలో అమ్మా,నాన్న అవన్నీ చూసేశారు. మా కోసం మా నాన్నగారు మళ్ళీ బయలుదేరారు.

లింగాకృతిలో స్వయంభూ ఉమామహేశ్వరస్వామి వెలసిన క్షేత్రం యాగంటి. గుంతకల్లు నుంచి 103 కిలోమీటర్ల దూరంలో ఉందీ పుణ్యక్షేత్రం. చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసుకుంటున్న సాధుపుంగవుల్లా గంభీరంగా ఉంటే,మధ్యలో ధవళకాంతులతో మెరిసిపోతున్న ఆలయం ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరునిలా ఉంటుంది.
గుడిలోకి ప్రవేశించగానే పుష్కరిణి స్వాగతమిస్తుంది. ఎక్కడో ఉద్భవించిన నీరు,నందికేశుని నోటినుండి ధారగా పడుతూ కోనేరుని నింపుతుంది.' సబ్బులు,షాంపూలు వాడరాదు.బట్టలు ఉతకరాదు ' అని తాటికాయంత అక్షరాలతో బోర్డులు పెట్టినా భక్తులు ఖాతరు చెయ్యకపోవటం వల్ల కోనేట్లో నీరు అపరిశుభ్రమైపోయింది. ఆలయ నిర్వాహకులు కూడా ఆట్టే పట్టించుకునేట్లు లేరు. పుష్కరిణిలో పాదప్రక్షాళనం చేసుకోని, నంది నోటి నుంచి పడుతున్న నీరు నెత్తిన చల్లుకొని ఆలయలోకి వెళ్ళాం. గర్భాలయంలో శివలింగానికి బదులుగా లింగాకృతిలో ఉన్న పార్వతీపరమేశ్వర స్వరూపం కనిపించింది. అమ్మవారికి బొట్టు పెట్టారు. స్వామివారికి తిలకం దిద్దారు. స్వామివారిని దర్శించుకొని వెలుపలికి వస్తే జీవకళ ఉట్టిపడుతున్న నిలువెత్తు నందికేశుడు కనువిందు చేస్తాడు.


స్థలపురాణం

ఈ క్షేత్రం గురుంచి ఒక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. యాగంటి అసలు పేరు నేగంటి. ఉత్తరభారతదేశ యాత్ర ముగించుకొని దక్షిణదేశానికి వచ్చిన అగస్త్య మహర్షి, ఇక్కడి ప్రశాంతతకు ముగ్ధుడై ఇక్కడొక వేంకటేశ్వరాలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. తన తపోశక్తితో వేంకటేశుని విగ్రహాన్ని సృష్టించి దానిని ప్రతిష్ఠించాలని జపహోమాలు చెయ్యగా విగ్రహం యొక్క కాలి బొటనవ్రేలు గోరు విరిగిపోయింది. విరిగిన విగ్రహం అభిషేకాలకు పనికిరాదు కాబట్టి దానిని అక్కడే ఒక గుహలో స్థాపించి, జరిగిన దానికి విచారపడి పరమేశ్వరున్ని ప్రార్థించగా, ఆయన ప్రసన్నుడై ఈ ప్రదేశం శైవక్షేత్రంగా విలసిల్లగలదని ఆభయమిచ్చాడు. అగస్త్య మహర్షి కోరిక మేరకు లింగాకృతిలో ఉమామహేశ్వర స్వరూపంతో ఉద్భవించాడు.

చాలాకాలం తర్వాత గురుశిష్యులైన శివభక్తులిద్దరు, పశువులు మేపుతూ ఈ అటవీప్రాంతంలో సంచరిస్తూండగా లింగాకృతిలో ఉన్న ఉమామహేశ్వర విగ్రహం వారికి తారసపడింది. ఎన్నో ఏళ్ళుగా అదే ప్రాంతంలో తిరుగుతున్నా ఏనాడూ ఎదురవని లింగం ఆనాడు కనిపించేసరికి వారిద్దరూ ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఆనాటి నుంచి రోజూ నిష్ఠగా పూజలు చేస్తూ రెండు విస్తరాకులలో అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టేవారు. భక్తులిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో పరీక్షించాలని భావించిన స్వామి,వటువు వేషం దాల్చి తనకూ కాస్త ప్రసాదం పెట్టమని ఇద్దరినీ అడిగాడు. గురువు మౌనం వహిస్తే, శిష్యుడు సరేనన్నాడు. మరుసటి రోజు మూడు విస్తళ్ళలో నైవేద్యం సిద్ధం చేసి వటువు కోసం ఎదురుచూశాడు శిష్యుడు. 'మూడో విస్తరి ఎవరికోసం' అని అడిగిన గురువుకి 'అన్నార్థుల కోసమని సమాధనమిచ్చాడు . గురువు ధ్యానంలో మునిగిపోయాడు. వటువు రాలేదు కానీ పులి వచ్చింది. స్వామి వారే పులి రూపంలో వచ్చి 'ఆకలిగా ఉంద 'ని అర్థించారు. శిష్యుడు మారుమాట మాట్లాడకుండా ముందే సిద్ధం చేసిన మూడో విస్తరిని ముందుపెట్టాడు. నైవేద్యాన్ని ఆరగించిన పులి ఇకా ఆకలిగా ఉందంటే తన విస్తరిని కూడా సమర్పించుకున్నాడు. ఆకలి తీరని పులి ఇంకా అరుస్తూంటే శిష్యుడు సవినయంగా చేతులు జోడిచి ' ఓ వ్యాఘ్రమా ! ఆర్తుల కోసం ఉంచిన మూడో విస్తరిని ఇచ్చేశాను. నాకోసం దాచుకున్న విస్తరినీ నీకే దానం చేశాను. గురువుగారి విస్తరిని దానం చేసే అధికారం నాకు లేదు. ఇక మిగిలింది నేనే. నన్నే ఆహారంగా స్వీకరించు ' అంటూ పులినోట్లో తలపెట్టబోయాడు. పులి అంతర్థానమై సంతుష్టుడైన స్వామి సాక్షాత్కరించాడు. శిష్యుడికి మోక్షం ప్రసాదించి తనతో పాటూ కైలాసానికి తీసుకువెళ్ళాడు. ఇంతలో గురువు కళ్ళు తెరిచి శిష్యుడు కోసం చూస్తే, గగనవీధిలో శివపార్వతులతో కలిసి కైలాసం వెళ్తున్న శిష్యుడు కనిపించాడు. గురువు దీనంగా చేతులు జోడించి శివపార్వతులను పరిపరివిధాల స్తుతించి,శిష్యుని వైపు చూసి 'శిష్యా ! ఇంతకాలం ఇద్దరమూ కలిసిమెలిసి ఉన్నాం.భగవంతుడి సపర్యలు చేశాం.ఇప్పుడు ఒక్కడివే వెళ్ళిపోతావా? నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు ' అని వేడుకొన్నాడు. శిష్యుడు కరిగిపోయి 'గురువుగారు! ఇదిగో ఈ వస్త్రాన్ని వదిలేస్తున్నాను. దీనిని మీరు పట్టుకున్నట్లైతే నాతోపాటూ బొందితో కైలాసం వచ్చేస్తారు ' అని వస్త్రాన్ని జారవిడిచారు.క్రిందకు జారిన ఆ వస్త్రం కాలనాగై గురువు కంటబడింది.గురువు ముట్టుకొలేకపోయాడు.శిష్యుడు కైలాసం వెళ్ళిపోయాడు.

ప్రస్తుతమున్న శివాలయాన్ని విజయనగర ప్రభువులైన హరిహర బుక్కరాయల కాలంలో నిర్మించారు. గర్భగుడికి వెనుకవైపు అగస్త్య పుష్కరిణి ఉంది. ఇందులో నీళ్ళు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి. చుట్టూ ఉన్న పర్వతాలలో అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ,వేంకటేశ్వరస్వామి వారి గుహ,వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం వ్రాసిన గుహలు ఉన్నాయి. నిట్టనిలువుగా ఉన్న మెట్లు ఎక్కి గుహల్లోకి వెళ్ళాలి. బ్రహ్మంగారి గుహలోకి వెళ్తే నడుం బాగా వంచి వెళ్ళాలి. వృద్ధులకు స్థూలకాయులకు కష్టంతో కూడుకున్న పని.యాగంటిలో కంటికి కనిపించే అద్భుతాలు మూడు

  1. 1.   యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించవు. పూర్వం అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటూంటే కాకాసురుడనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి గోల చేస్తూ ఆయన ప్రశాంతతకు భంగం కలిగించాడట. ఆగ్రహించిన ఆయన ఆ కాకిని భస్మం చేసి,కాకులెప్పుడూ ఈ ప్రాంతానికి రావటానికి వీళ్ళేదని ఆంక్షలు విధించాడట. కాకి శనేశ్వరుని వాహనం. కాకిని బహిష్కరించడమంటే ఆయనను వెలేసినట్టే. అందుకే ఈ శివాలయంలో నవగ్రహ మంటపం ఉండదు.

  2. 2.   ఈ క్షేత్రంలో ఎక్కడో ఉద్భవించిన నీరు ఎప్పుడూ పారుతూనే ఉంటుంది. ఇవి త్రాగడానికి మాత్రమే పనికొస్తాయి. వ్యవసాయం కోసమో, మరే ఇతర అవసరాల కోసమో నీళ్ళు మళ్ళించాలని చూస్తే ఆ ప్రయత్నం సిద్ధించదు. పొలాల కోసం నీళ్ళు మళ్ళించాలని అనేక ప్రయత్నాలు చేసిన ప్రభుత్వం చివరికి తన ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చింది. క్షేత్రం దాటిన వెంటనే నీళ్ళు భుమిలోకి ఇంకిపోయేవట.

  3. 3.  ఉమామహేశ్వరస్వామి గర్భగుడికి ఎదురుగా,ఈశాన్యమూలలో ఉన్న బసవయ్య విగ్రహం(నందీశ్వరుడు)నిత్యం పెరుగుతూనే ఉంది. తొంభై ఏళ్ళ క్రితం నాలుగుస్తంభాల మధ్య చిన్నదిగా ఉండి ప్రదక్షిణలకు అణువుగా ఉన్న ఈ విగ్రహం ఇప్పుడు అమాంతం పెరిగి పెద్దదైపోయి మండపం దాటి వెలుపలికి వచ్చేసింది. ప్రదక్షిణలు చెయ్యడం కష్టమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఇరవై ఏళ్ళలో ఈ విగ్రహం ఒక అంగుళం పెరిగింది. ఈ బసవయ్యే కలియుగాంతంలో కాలుదువ్వి రంకె వేస్తుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం చెబుతోంది.


యాగంటి నుంచి పదికిలోమీటర్ల దూరంలో బనగానపల్లెలో బ్రహ్మం గారి నేలమఠం ఉంది. అక్కడే ఆయన వ్రాసిన కాలజ్ఞాన గ్రంథాలను ఒక చింతచెట్టు క్రింద నిక్షిప్తం చేశారు. వాటిల్లో ప్రస్తుతం ఒక గ్రంథం మాత్రమే బయటపడిందని,మిగతా రెండింటిని వీరభోగవసంతరాయల అవతారంలో బ్రహ్మంగారే వెలుపలికి తీస్తారని ఆలయ పూజారి చెప్పారు. అంతే కాదు ఈ చింతచెట్టు కాయలు తినడానికి పనికిరావని,కలియుగాంతంలో ఇదే చెట్టుకు మల్లెపూలు పూస్తాయని కూడా చెప్పారు.


అక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని రవ్వలకొండకి వెళ్ళం. అక్కడ కొన్నాళ్ళు అచ్చమ్మ గారి ఆలమందలు కాస్తూ, ఒక గుహలో బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాశారట. పాతాళబావి లాంటి ఆ ప్రదేశానికి ఒకటే దారి. మెల్లగా మెట్లు దిగి నడుము బాగా వంచి చీకటిలో లోపలకి వెళ్తే బురదనీళ్ళతో నిండిన ప్రదేశం వస్తుంది. గాలి కూడా సరిగ్గా ఆడదు. పదిమంది కంటే ఎక్కువ మంది వెళ్తే ఊపిరాడక చనిపోయే అవకాశాలెక్కువ. అక్కడే శేషశాయి నీడలో కాలజ్ఞానం వ్రాసుకుంటున్న బ్రహ్మంగారిని చూసిన అచ్చమ్మ,ఆయన శిష్యురాలైపోయిందట.


బనగానపల్లెలో భోజనవిరామం తీసుకొని అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని బెలూం గుహలకు బయలుదేరాం. ప్రవేశద్వారం వద్దనున్న అతి పెద్ద బుద్ధవిగ్రహం చూపరులని ఆకట్టుకొంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలను 1884లో బ్రిటీషువారు

కనుగొన్నారు. తర్వాత దాదాపు ఒక శతాబ్దం పాటూ మరుగునపడిపోయిన వీటిని జర్మన్ దేశస్తుడైన గేబర్ సారథ్యంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ గుహలకు తుది ఎక్కడో ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా మూడున్నర కిలోమీటర్ల మార్గాన్ని మాత్రమే తవ్వకాలలో కనుగొన్నారు. అందులో ఒకటిన్నర కిలోమీటరు వరకే ప్రజాసందర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బౌద్ధమతానికి సంబందించిన ఎన్నో ఆనవాళ్ళు ఇక్కడ దొరికాయి. భూమట్టానికి 120 అడుగుల క్రింద వరకు వెళ్ళగలిగిన ఈ గుహ లోపల,ప్రకృతి సహజంగా ఏర్పడిన రకరకాల ఆకారాలకు పేర్లు పెట్టి, లైటింగ్, పైపుల ద్వారా వెంటిలేషన్ ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది పర్యాటక శాఖ. మేం కూడా కొంతదూరం గుహలో బిక్కుబిక్కుమంటూ పాక్కుంటూ వెళ్ళి సాహసయాత్ర చేసినంత బిల్డప్పిచ్చి అలసిపోయి చివరికి ఇంటిదారి పట్టాం.
కొసమెరుపు
యాగంటి నుంచి బనగానపల్లె వెళ్ళే దారిలో ఒక పాడుబడిన నవాబుల బంగళా ఉంది. దానికే కాస్త గ్రాఫిక్స్ జోడించి ఒక పెద్ద కోటగా భ్రమింపజేస్తారు అరుంధతి సినిమాలో. అప్పటి నుంచి ఇది అరుంధతి కోటగా చేలామణి అవుతూ ఒక సందర్శన క్షేత్రమైపోయింది.


4 comments

May 9, 2011 at 12:33 AM

బెలూం గుహలు , యాగంటి ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్ లో చూడ తగ్గ ప్రదేశాలలో ఉన్నాయి. మూడు ఏళ్ళ క్రితం ఒక ఆదివారం సరదాగా బయలుదేరి వెళ్లి రెండు రోజులు అక్కడే ఏపి టూరిజం వారి బసలో ఉంది చూసి తరించాం, ఆ తరువాత చాలా మందిని చూడామణి చెప్పటం జరిగింది.

Reply
May 9, 2011 at 10:47 AM

లోకేష్‍౬గారు.. యాగంటి, బెలుం గుహల గురించి మంచి సమాచారం అందించారు..మీ వ్యాసం చాలా బాగుంది. ఇదే యాత్రా స్థలంమీద నా బ్లాగ్‌లో ఒక వ్యాసం వ్రాసాను..మీకు వీలున్నప్పుడు చూడగలరు.

http://mahavarnam.blogspot.com/2010/11/blog-post.html

Reply
May 9, 2011 at 11:54 AM

quite informative and interesting. keep it up

Reply

@ఆత్రేయగారు, vrao గారు
థాంక్యూ..

@కమల్‌గారు,
మీ టపా చదివాను.ఫోటోలు చాలా బావున్నాయి.

Reply
Post a Comment