విశ్వనాథ - వేయిపడగలు - సమీక్ష - మూడవభాగందాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత విశ్వనాథ వారి వేయిపడగలు నవల సమీక్షకు మూడవ భాగం వ్రాస్తున్నందుకు పాఠకులు క్షమించాలి. దీనికి ప్రధాన కారణం అంత పెద్ద కథను క్లుప్తంగా ఎలా చెప్పాలో వెంటనే బోధపడకపోవటం. అందువల్లనే దీనిని వెనక్కి నెట్టి మిగతా విషయాల మీద టపాలు వ్రాయటం జరిగింది. ఇప్పుడు వీలు చిక్కింది కాబట్టి నింపాదిగా ఒకటికి రెండుసార్లు చదివి మధ్యలోనే ఆగిపోయిన సమీక్షను కొనసాగించదలచుకున్నాను. ముందు మిగతా కథలోకి వెళ్దాం.

రామేశ్వరం తాలూకా అధ్యక్షుడవుతాడు. సినిమా వ్యాపారం మొదలుపెట్టి డబ్బులు బాగా వెనకేసుకుంటాడు. జోస్యులు అనే ఉపాధ్యాయుడు అతని ప్రాపు కోసం ప్రాకులాడి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. జోస్యులు భార్య మంగమ్మ. ఆమెకు నాగరిక లక్షణాలు తెలియవు. పైగా మగడంటే ఎక్కడలేని అయిష్టత. రామేశ్వరం మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకుంటాడు. విషయం తెలిసిన జోస్యులు తీవ్రంగా మథనపడి, సంగతి నలుగురికీ తెలిసిందని గ్రహించి అత్మహత్యాప్రయత్నం చెయ్యబోయి ధైర్యం చాలక గొల్లుమంటాడు.

పాఠశాలల తనిఖీకి వచ్చిన రామేశ్వరాన్ని చూసి జోస్యులు ఖాతరు చెయ్యకుండా నిద్రబోతాడు.రామేశ్వరం సంజాయిషీ కోరుతూ చీటీ పంపితే ' తాను సరిగ్గాలేడు గనకే తన భార్యను అతను ఏలుకొంటున్నాడని,తన నెల జీతం తనకు నెలా నెలా సరిగ్గా ముట్టజెప్పాలని,అలాగే తన భార్యతో కలిసి ఇంకా తను ఒకే ఇంట్లో ఉంటున్నందుకు పైకం పంపించాలని',తిరుగు టపా పంపుతాడు జోస్యులు. మంగమ్మ మోజులోపడిన రామేశ్వరం తన యావదాస్తిని ఆమె పేరిట వ్రాస్తాడు. అందరూ జోస్యుల్ని నపుంసకుడని గేలిచేస్తారు. జోస్యులు ఉన్మాదావస్థకు లోనై ఒకరోజు వీధిలో పెద్దమనుషులతో వెళ్తున్న రామేశ్వరం మీద కత్తితో దాడి చేస్తాడు. రామేశ్వరం మనుషులు అతని ఒళ్ళు హూనం చేస్తారు. పిచ్చివాడై రాత్రిపూట గుండేరు దగ్గర తిరుగుతున్న జోస్యులు హత్యకు గురవుతాడు.

రామేశ్వరం దొంగనోట్ల కేసులో అరెస్టవుతాడు. అతని పలుకుబడి ఆస్తిపాస్తులు అతన్ని రక్షించలేకపోతాయి. ఏడేండ్ల జైలుశిక్ష పడుతుంది. భర్తపోయాక గడసరితనం, నిర్భయత్వం అలవర్చుకున్న మంగమ్మ, జైలుకి వెళ్ళి రామేశ్వరాన్ని అపహాస్యం చేస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో అరెస్టయిన తన స్నేహితుడిని చూడటానికి అదే జైలుకు వచ్చిన ధర్మారావు, కటకటాల వెనుకనున్న రామేశ్వరాన్ని చూసి తగినశాస్తి జరిగిందని అనుకుంటాడు.

ధర్మారావు స్నేహితుడు కిరీటి. అతనికి తన మరదలంటే చాలా ఇష్టం. తన కూతురుని అతనికే ఇచ్చి పెళ్ళి చేస్తానని చిన్ననాడు ప్రమాణం చేసిన అతని మేనమామ,ఆ తర్వాత నయాపైసా సంపాదన లేదని తెలిసి విముఖత చూపిస్తాడు.కిరీటి తల్లి మరణిస్తుంది.కిరిటి మరింత కృంగిపోయి నిద్రాహారాలు లేక నీరసించిపోతే,కబురందుకున్న అతని మేనమామ జాలిపడి తుదకు పెళ్ళికి అంగీకరిస్తాడు.

రాధాపతి ఒక మోస్తరు కవి. మంచి మాటకారి పైగా జిత్తులమారి. పనీపాటా లేకుండా ఆవారాగా తిరుగుతూంటాడు. బిజిలీ అనే ఒక నాటకాలపిల్లతో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపి,ఆమె తరపువాళ్ళు కర్రలు పుచ్చుకోవడంతో కాలికి బుద్ధిచెప్పి మనోచాంచల్యం చావక ట్రైనులో తారసపడిన ఒక ఉపాధ్యాయురాలిని బుట్టలో వేసుకుంటాడు. ఆమెతో కొన్నాళ్ళు సహజీవనం చేసి ఆమెను గర్భవతి చేస్తాడు. పెళ్ళి కాకుండా తల్లయినందుకు ఆమె కించపడి అబార్షన్ చేయించుకుంటుంది. అప్పటికి అతని వాలకం తేటతెల్లమై అతనితో తెగతెంపులు చేసుకుంటుంది. అప్పులవాళ్ళు పట్టుకుపోగా మిగిలిన ఆస్తిని కరిగించి బెజవాడలో అనాధ స్త్రీ శరణాలయం తెరుస్తాడు రాధాపతి. రామేశ్వరం ద్వారా ప్రాప్తించిన ధనంతో అక్కడికి చేరుకున్న మంగమ్మ, అతని తీపిమాటలకు మోసపోయి అతనితో పాటూ తిరిగి సుబ్బన్నపేట వచ్చేసి సహజీవనం ప్రారంభిస్తుంది.

పంకజమ్మ ఒక వితంతువు. ఆమె కూతురు శ్యామల కుమారస్వామి అనే ఒక పేదబ్రాహ్మణ విధ్యార్థిని ఇష్టపడుతుంది.పంకజమ్మకు ఇదంతా ఇష్టముండదు. అందరికీ తనమీద గౌరవం ఉండటం చేత వారు పిలిచినప్పుడల్లా వెళ్ళి చర్చల్లో పాల్గొంటూ అనేక విషయలమీదా వాదోపవాదాలు చేస్తూంటాడు ధర్మారావు. అతని ఆభిప్రాయాలు,భావాలు రాధాపతికి నచ్చవు. బి.సి.కాలం నాటి వాడంటూ అతన్ని ఈసడించుకుంటాడు. తనతో పాటూ బెజవాడ రావల్సిందిగా మంగమ్మను కోరుతాడు. ధర్మారావు ప్రభావంతో మారిపోయిన ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది.

ధర్మారావు దంపతులు 'ఉండి' వెళ్ళి పశుపతి ఇంట్లో కొన్ని రోజులుంటారు. పశుపతి కూతురు పేరు కూడా అరుంధతే. ఆ పాపతో వారిద్దరికీ చనువు కుదురుతుంది. సుబ్బన్నపేటలోని బ్రాహ్మణవీధిలో మంటలంటుకొని ఇళ్ళు తగలబడిపోతాయి. పురపాలక సంఘం సమావేశమై కుళాయిలు విద్యుద్దీపాలు సమకూర్చుకోవాలని నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయాన్ని ధర్మారావు అన్నగారు వ్యతిరేకిస్తారు. ఉన్న అప్పులే తీరలేదని,కొత్తగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజలందరిమీదా పన్నులభారం పడుతుందని వాదిస్తారు. ఆయన మాటలను అందరూ పెడచెవిని పెడతారు. సుబ్బన్నపేటకు కుళాయిలు,విద్యుద్దీపాలు వస్తాయి. స్త్రీ సంఘం ఏర్పాటై బాల్య వివాహాలు,విధవా వివాహాల మీద చర్చలు మొదలవుతాయి.

రంగారావు శ్రీలంక నుంచి ఒక ఫ్రెంచి వనితను తీసుకొచ్చి వివాహం చేసుకుంటాడు. ఇంగ్లీషు భార్యకు,ఫ్రెంచి భార్యకు మధ్య సవతుల గొడవ ప్రారంభవుతుంది. కోర్టుకెక్కి సమస్యలు తెచ్చుకోలేక ఫ్రెంచి వనితను నెలభరణానికి ఒప్పించి ఆమెను తిరిగి శ్రీలంక పంపేస్తాడు రంగారావు. ఇంగ్లీషు భార్య పేరు సుసానీ. సాధ్యమైనంత పైకం మూటగట్టుకొని ఇంగ్లాండుకు శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఆమెకు ఊహ కలుగుతుంది. ఈ లోగా రంగారావు అంతుచిక్కని వ్యాధికి గురవుతాడు. ఇంగ్లీషు మందులు పనిచెయ్యవు. ఇదే సమయమని భావించిన సుసానీ తను ఇంగ్లాండు వెళ్ళిపోతానని రంగారావుతో చెబుతుంది. అతను అంగీకరిస్తాడు. సుసానీ ఉన్నదంతా ఊడ్చుకొని ఇరవైలక్షల రూపాయలతో వెళ్ళిపోవాలని సన్నాహాలు చేసుకుంటుండగా రంగారావు కొడుకు హర్రప్ప వచ్చి తన తల్లి నగలు మాత్రం విడిచి వెళ్ళమని అర్థిస్తాడు. ఆమె ఒప్పుకొని మిగిలిన సొమ్మంతా పెద్ద పెద్ద పెట్టెలలో పోగేసుకొని ఇంగ్లాండు తీసుకుపోతుంది. అయితే ఆమెను మోసం చేసి పది లక్షలవరకు కాజేస్తాడు దివాను. హర్రప్ప రాజ్యాధికారం తన చేతుల్లోకి తీసుకొని అన్ని వ్యవహారాలు చక్కబెడతాడు. తండ్రికి ఆయుర్వేద వైద్యున్ని కుదుర్చి ధర్మారావుని తన దివానుగా నియమిస్తాడు. జీతం పుచ్చుకోడానికి ధర్మారావు అంగీకరించడు.

కుమారస్వామి,శ్యామల వివాహం జరుగుతుంది. బ్రతుకు గడవడం కోసం మంగమ్మ దగ్గర అప్పులు చేస్తూంటాడు. అతను పదే పదే ఇంటికి రావటం రాధాపతికి నచ్చదు. మంగమ్మ రాధపతిని లక్ష్యపెట్టదు. ఆమె సారంగధర నాటకంలో చిత్రాంగి వేషం కడుతుంది. అరుంధతి రోగగ్రస్తురాలవుతుంది.

హర్రప్ప నాయనమ్మకు, తల్లికి కర్మలు చేసి,వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలకు అంకురార్పణ చేస్తాడు. ధర్మారావు కుటుంబసభ్యులు సంతోషసాగరంలో మునిగిపోతారు. బంధుమిత్రాదులతో ధర్మారావు గృహం కళకళాడుతుంది. పిల్లవాడైన ధర్మారావు కొడుకు కోటకు ఒంటరిగా వెళ్ళి భయం లేకుండా సంచరిస్తూ,ముద్దు ముద్దు మాటలతో రోగిపీడుతుడైన రంగారావుకు ఉల్లాసాన్ని కలిగిస్తూంటాడు. ఇంతకాలం కళ్యాణోత్సవాల కోసమే ఎదురుచూసిన దేవదాసి,ఉత్సవాలలో అందంగా అభినయించి ప్రాణాలు విడుస్తుంది. ఈలోగా అరుంధతి అనారోగ్యం ముదిరి అవసానదశకు చేరుకుంటుంది.

తన ఆవేశం కారణంగా ఉద్యోగం కోల్పోతాడు కుమారస్వామి. మంగమ్మ అతన్ని కుమారునిగా భావించి ఆస్తంతా అతని పేర, ఏటా స్వామి ఉత్సవాల నిర్వహణ పేరిట రాసేస్తుంది. చిన్ననాడు ఇష్టపడిన తన బంధువుల అమ్మాయిని శరణాలయం వచ్చి తన బాగోగులు చూడవలసిందిగా అభ్యర్తిస్తాడు రాధాపతి. ఆమెకు ఇదివరకే పెళ్ళయ్యింది. మొగుడితో దెబ్బలాడి రాధాపతితో వచ్చేసి సహజీవనం ప్రారంభిస్తుంది. తనను ప్రేమించమని ఆమెనడుగుతాడు రాధాపతి. సహజీవనం చేస్తున్నా కూడా అతనిని ప్రేమించలేనంటుందామె. రాధాపతి విరక్తి చెంది సైనేడు మింగి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ విషయమంతా అతని సహచరుడు వ్రాసిన ఉత్తరం వలన మంగమ్మకు తెలుస్తుంది. ఆస్తంతా ఇతరులకు దానం చేసిందనే కోపంతో,నమ్మకంగా పనిచేస్తునట్లు నటిస్తూ వచ్చిన చెంగల్రావనే వ్యక్తి మంగమ్మను హత్య చేస్తాడు. పోలిసులతన్ని అరెస్టు చేస్తారు. అరుంధతి మరణిస్తుంది.ధర్మారావు శోకసముద్రంలో మునిగిపోతాడు.

రంగారావు ఆరోగ్యం కుదుటపడుతుంది. హర్రప్ప యోగమరణం పొందుతాడు. గణాచారి పాకలోనే తగలబడిపోతుంది. ధర్మారావు పశుపతి ఇంటికి వెళ్తాడు. పశుపతి కూతురు చిన్న అరుంధతి ధర్మారావునే పెళ్ళాడుతానని పట్టుబడుతుంది. పశుపతికి బాల్యవివాహాలు ఇష్టం లేకపోయినా కూతూరు మొండిపట్టుదలకు తలొగ్గి ధర్మారావుకిచ్చి పెళ్ళిచేస్తాడు. స్వర్గస్తురాలైన తన భార్య అరుంధతియే చిన్న అరుంధతినావహించినదని ధర్మారావు భావిస్తాడు . చిన్న అరుంధతి అవునని చెప్పటంతో నవల సమాప్తమవుతుంది.


(విశ్లేషణతో కూడిన చివరిభాగం తరువాతి టపాలో)