తెలుగు వెలుగులో నా కవిత ' ఏటిగట్టున '

తెలుగు వెలుగు ఫిబ్రవరి 14 సంచిక లో నా కవితను ప్రచురించినందుకు ఈనాడు యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. 

చదివిన వెంటనే  ఐజ,గద్వాల్ నుంచి ఈనాడు ఏజెంటొకరు ఫోన్ చేసి అభినందించారు. ఇది నాకొచ్చిన మొదటి ప్రతిస్పందన. తర్వాత తిరుపతి నుంచి ప్రధానోపాధ్యాయుడొకరు, తాడేపల్లిగూడెం నుంచి అడ్వకేటుగారొకరు ఫోన్ చేసి తమ సంతోషాన్ని తెలియజేశారు.  నాకిదో కొత్త అనుభూతి. వారికీ నా కృతజ్ఞతలు.



తెలుగు వెలుగుకు కవితను పంపించాక ప్రచురణకు ఎంపికయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఏడాది పాటు నీరీక్షించవలసి వచ్చింది. ఏడాది కాలం ఎక్కువే. ఈలోగా ఆశలు వదిలేసుకొని కవితకు ఇంకొన్ని మార్పులు చేసి ఓ అంతర్జాల సాహిత్య వారపత్రికకు పంపాను.అక్కడా అమోదం పొందింది.  ' హమ్మయ్య ఇక  ప్రచురితమవబోతోంది ' అనుకుంటూండగా తెలుగు వెలుగు  నుంచి సంక్షిప్త సమాచారం ..' మీ కవిత ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. వివరాలు పంపించండి ' అంటూ..


ఫిబ్రవరి సంచికలో చివరి మూడు వాక్యాలు ప్రచురించలేదు.

పూర్తి కవిత ఇక్కడ


టిగట్టున కూర్చున్నాను
కోటి ఊసులు వింటూ
ఈ ఏరు నా కన్నతల్లి
మమతానురాగాల పాలవెల్లి

ఊయలూగే శైశవంలో
ఉలిక్కిపడి గుక్కపడితే
చేలోఉన్న తండ్రి చెంగున చెంతకు చేరేలోగా
గలగలల లల్లాయి పాడి సుఖనిద్ర పుచ్చింది
జోల కాదది విమల గాంధర్వ డోల
మాతృహృదయానంద పారవశ్య హేల

ఉరకలేసే బాల్యంలో
కుప్పించి దుమికి కాళ్ళు తాటిస్తే
ఉప్పొంగిన ప్రేమై ఉవ్వెత్తున పైకిలేచి
అలల చేతులతో ఆశీర్వదించింది
ఈ ఏటి పొత్తిళ్ళలో కేరింతలు కొట్టి
సంబరపడిపోయారు సూరీడూ చంద్రుడు

అరకదున్నే ప్రాయంలో
మెరికనై వొళ్ళు వంచి
తూములు కట్టి తనువును తోడేస్తే
స్తన్యమిచ్చిన తల్లై సస్యాన్ని సజీవం చేసింది
పిండారబోసిన వెన్నెల్లో నిండార మెరిసే ఏటి తరగలు
మట్టి మనుషుల వెట్టి బ్రతుకుల్లో వెలిగించిన మతాబా దివ్వెలు

రెక్కలొచ్చీ  నేను
రేవు దాటెళ్ళబోతూంటే
అక్కరగా ఆవలిగట్టు చేర్చి బుంగమూతి పెట్టింది
సుళ్ళు తిరిగే దుఃఖాన్ని స్తబ్ధతలో దాచిపేట్టి సాగనంపింది  


ప్రవాసంలో ...రాలిన  ప్రతి చినుకులోనూ నా తల్లి పలకరింపు విన్నాను

ఆవాసం చేరి ఆశీస్సులు కోరబోతే అర్థమయ్యిందది పరామర్శ కాదు పరివేదనని !


 నాగరికత నేర్పిన ఏరు
నేడు నిరాదరణకు గురైన తల్లిలా నిర్వేదంగా ఉంది
ధనమదాంధులై మానవాధములు కొందరు
దురాక్రమణ చేసీ దోచుకుంటూంటే
బొమికల రేణువులు మిగిల్చుకొని బిక్కుబిక్కుమంటోంది
జీవవైవిధ్యం జాతర చేసిన చోట
శూన్యనైరాశ్యం తాండవిస్తూంటే
అశ్రుపూరిత నయనాలతో
ఎండిపోయిన ఏటిగుండెను తడిమాను
మూగబోయిన ఇసుకరేణువుల్లో మెల్లగా ఏదో ప్రతిస్పందన !
ఏదో సంచలనం ! !
ఉబికి జారిన నా కన్నీరు ఊటగా మారుతుందా ?
ఉద్రేక గంగాతరంగినియై నా తల్లి ఈ ఊరిని ముంచెత్తుతుందా ?
చరిత మరచిన ఈ జాతికి భవితనిస్తుందా ? ?



4 comments

February 3, 2014 at 6:46 AM

లోకేశ్ శ్రీకాంత్ గారూ, హృదయపూర్వక అభినందనలండీ! అచ్చులో చాలా బాగుంది.

"కుప్పించి దుమికి" - శ్రీకృష్ణుడే గుర్తొచ్చాడు. "విమల గాంధర్వ డోల", " ఏటి పొత్తిళ్ళలో" లాంటి పదబంధాలు అద్భుతంగా ఒదిగాయీ కవితలో.

"అశ్రుపూరిత నయనాలతో
ఎండిపోయిన ఏటిగుండెను తడిమాను
మూగబోయిన ఇసుకరేణువుల్లో మెల్లగా ఏదో ప్రతిస్పందన !
ఏదో సంచలనం ! !" -- ఈ ప్రతిస్పందనలోనే మీ చివరి మూడు ప్రశ్నలూ ఉన్నాయండీ, ఇంకా అవ్యక్తమవని ఎన్నో బరువైన భావాలు కూడా. వాటిని ఎవరికి వారే తడిమి చూసుకుంటే బాగుంటుందని వదిలేసి ఉంటారు. అలాక్కూడా బాగుంది నాకు.

Thank you.

Reply

మానస గారు,

మీ విశ్లేషణాత్మక వాక్యాలకు కృతజ్ఞతలు :) ఫోన్ చేసిన మిత్రులలో కొంతమంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారండి

Reply
February 9, 2014 at 9:43 PM

Chaalaa chaalaa bagundi lokesh gaaru.mee blog ippude chusanu,chaalaa baagundi.
Congrats.

Reply

కార్తీక్ గారు థాంక్యూ

Reply
Post a Comment