ఈ దారుణం విన్నారా? మా చిన్నారి పుణ్యమా అని నాకీ సందేహం కలిగి ఒక నిష్టూర సత్యం బయటపడింది కానీ,లేకుంటే ఈ అన్యాయం కూడా,తరతరాలుగా మగజాతికి జరుగుతున్న వెలుగులోకిరాని అనేక పరాభవాల జాబితాలో చేరిపోయేది.
ఆగాండాగండి..విషయంలోకి వచ్చేస్తున్నాను.
అమ్మకు అమ్మను అమ్మమ్మ అంటాం.
నాన్నకు అమ్మను నాన్నమ్మ అంటాం.
కానీ అమ్మకు నాన్నైనా,నాన్నకు నాన్నైనా ముక్తసరిగా తాతయ్య అనేసి చేతులు దులుపుకుంటాం.అమ్మలకు రెండు పేర్లుంటే,నాన్నలకు మాత్రం ' తాతయ్య ' అని ఒకే పేరుతో సర్దిపెట్టేశారు.
దీనివల్ల బోలెడంత కష్టం ఉంది.
తాతయ్య అని ఒకరిని పరిచయం చేసి,ఇంకొకరి ఫోటో చూపించి మళ్ళీ తాతయ్య అంటే,మొదటి వ్యక్తి అమ్మకు నాన్నని,రెండో వ్యక్తి నాన్నకు నాన్నని అర్థం చేసుకోవటానికి బుడుగులు,సిగానపెసూనాంబలు ఎంత కష్టపడాలి.అంత చిన్న వయసులో వారి చిట్టి మెదళ్ళని మానసికశ్రమకు గురిచెయ్యడం అవసరమా? తాతలిద్దరిదీ వేర్వేరు ఊర్లయితే,ఏ హైదరాబాద్ తాతనో,తిరుపతి తాతనో చెప్పుకునే వెసులుబాటు ఉంది.అదే ఇద్దరిదీ ఒకే ఊరయితే,అప్పుడేమని పిలవాలి? గాంధీరోడ్ తాతనో, లేక నెహ్రూవీధి తాతనో నా? తాతయ్య గురుంచి చెప్పుకోవాల్సిన ప్రతిసారీ,ఏ తాత గురుంచి చెబుతున్నామో,ఆ విషయం మీద స్పష్టతనివ్వాల్సి రావటం భావ్యమా? వాగానుశాసనుడైన నన్నయ్య కూడా ఈ విషయం పై దృష్టి పెట్టకపోవటం శోచనీయం.
దీనిని నేను ఖండిస్తున్నాను.
అమ్మనాన్న,నాన్ననాన్న అంటే బావుండదు కాబట్టి అర్జంటుగా ఒక ఉద్యమం లాగా 'తాతయ్య ' పదానికి ప్రత్యామ్నాయాలు వెదకాల్సిన అవసరం మనకందరికీ ఉంది.స్త్రీ సమానత్వం,పురుషాహంకారం మీద ఉద్యమాలు నడిపే మహిళాశిరోమణులు కూడా మగజాతికి జరిగిన ఈ అన్యాయాన్ని సావధానంగా పరిశీలించి,మా ఉద్యామానికి సహకరించల్సిందిగా నా విన్నపం.
ఏమంటారు?